రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
రూ.7 కోట్ల బడ్జెట్… నెల రోజుల్లోనే రూ.2,000 కోట్లకు పైగా వసూళ్లు
సినిమా రంగంలో స్టార్ హీరోలు, వందల కోట్ల బడ్జెట్ ఉంటేనే భారీ విజయాలు సాధ్యమని ఉన్న నమ్మకాన్ని తలకిందులు చేస్తూ ఒక చిన్న హాలీవుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కర్రీ బార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి కలెక్షన్లు రాబడుతోంది.
ఎలాంటి పెద్ద ప్రచారం లేకుండా విడుదలైన ఈ చిత్రం, కంటెంట్ బలంతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాను కేవలం 750,000 డాలర్ల (సుమారు రూ. 7–9 కోట్లు) పరిమిత బడ్జెట్‌తో నిర్మించారు. అయితే విడుదలైన నెల రోజుల్లోపే ప్రపంచవ్యాప్తంగా 224 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, భారతీయ కరెన్సీలో రూ. 2,000 కోట్లకు మించి రాబట్టి సినిమా పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది.
మొదటి వారం కంటే రెండో వారంలో ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ మరింతగా పెరగడం విశేషంగా మారింది. మౌత్ టాక్, సోషల్ మీడియాలో వచ్చిన చర్చలతో కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.
భారతదేశంలో కూడా ‘అబ్సెషన్’ హవా కొనసాగుతోంది. ఎలాంటి హంగామా లేకుండా ఇండియాలో కేవలం రూ. 1.75 కోట్ల ఓపెనింగ్‌తో ప్రారంభమైన ఈ చిత్రం, పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. రెండు వారాలు పూర్తికాకముందే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్ల మార్కును దాటేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
ఈ చిత్రంలో ఇండే నవరెట్, మైఖేల్ జాన్‌స్టన్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్టార్ కాస్ట్ లేకపోయినా, కథాబలం, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు కర్రీ బార్కర్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి వస్తున్న యునానిమస్ పాజిటివ్ రివ్యూస్ కారణంగా ఈ ఇండిపెండెంట్ హారర్ మూవీ, హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ఫోకస్ ఫీచర్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా కలెక్షన్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ చిత్రంపై స్పందించారు. భారీ బడ్జెట్లతో స్టార్ల వెనక పరిగెత్తే భారతీయ చిత్ర పరిశ్రమకు ‘అబ్సెషన్’ ఒక మేల్కొలుపు లాంటిదిగా ఆయన అభిప్రాయపడినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. కేవలం బలమైన కథ, నూతన కథన శైలి ఉంటే చాలు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని ఈ సినిమా మరోసారి నిరూపించిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాబోయే వారాల్లో కూడా ‘అబ్సెషన్’ లాంగ్ రన్ కొనసాగి మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, ఇండియాలో గతంలో విడుదలైన పలు భారీ హాలీవుడ్ చిత్రాల లైఫ్ టైమ్ రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఈ సంచలన చిత్రం ఓటీటీ వేదికపై విడుదల కానుండటంతో, అక్కడ కూడా కొత్త వ్యూవర్షిప్ రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.













