రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ బీచ్ కౌంటీలో ఓ ప్రైవేట్ జెట్ కుప్పకూలి తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల కారణాలపై ఏవియేషన్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో రాకపోకలను నిలిపివేసి, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ప్రభావంతో సమీప ప్రాంతాల్లో సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఈ ప్రమాదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన మార్-ఎ-లాగో నివాసానికి సుమారు తొమ్మిది మైళ్ల దూరంలో జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహామాస్ వైపు బయలుదేరిన లియర్‌జెట్ 60 విమానం ఒక్కసారిగా అదుపుతప్పి జనావాసాల మధ్య కూలిపోయింది.

స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఆకాశం నుంచి నిలువునా కిందకు దూసుకొచ్చిన విమానం మిలిటరీ ట్రైల్, టెన్త్ అవెన్యూ నార్త్ ప్రాంతంలో ఉన్న రోడ్డుపై పడిపోయి పేలిపోయింది. నేలను బలంగా ఢీకొట్టడంతో భారీ పేలుడు సంభవించింది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది.
విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. కార్లలో ప్రయాణిస్తున్న కొందరు తమ డ్యాష్‌క్యామ్‌లలో ప్రమాద దృశ్యాలను రికార్డు చేశారు. అందులో విమానం ఒక్కసారిగా కిందకు వేగంగా దూసుకొస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రహదారులు మూసివేత, సహాయక చర్యలు వేగవంతం
ప్రమాదం నేపథ్యంలో పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అప్రమత్తమైంది. మిలిటరీ ట్రైల్ రహదారిపై క్రీస్ట్‌హేవెన్ బులేవార్డ్ నుంచి 10వ అవెన్యూ నార్త్ వరకు రాకపోకలను నిలిపివేసింది. ప్రమాద స్థలానికి ప్రజలు, వాహనదారులు చేరకుండా ఉండాలని సూచించింది.
అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. పామ్ బీచ్ కౌంటీ ఫైర్ రెస్క్యూ విభాగం ఈ ఘటనను సుదీర్ఘంగా కొనసాగనున్న అత్యవసర సహాయక చర్యగా పేర్కొంది. ప్రమాద ప్రాంతానికి దూరంగా ఉండాలని ప్రజలను కోరింది.
విమానం కూలిన తర్వాత సమీప ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు స్థానికంగా పనిచేస్తున్న ఓ మహిళ వెల్లడించారు.

ఫ్లైట్‌రాడార్24 వివరాలు, విమాన మార్గంపై అనుమానాలు
విమాన ప్రయాణాన్ని ట్రాక్ చేసే వెబ్‌సైట్ ఫ్లైట్‌రాడార్24 వివరాల ప్రకారం, ఆస్టిన్ నుంచి బయలుదేరిన విమానం తొలుత సుమారు 41 వేల అడుగుల ఎత్తుకు చేరుకుంది. అనంతరం ఫ్లోరిడాలోని నేపుల్స్ ప్రాంతానికి సమీపంలో ఎత్తును తగ్గించడం ప్రారంభించింది. కొంతసేపు మళ్లీ పైకి ఎగిరినప్పటికీ, ఆ తర్వాత కుడివైపు వేగంగా మలుపు తిరుగుతూ కిందకు పడిపోయినట్లు విమాన ట్రాకింగ్ సమాచారం సూచించింది.
విమానం అదుపుతప్పడానికి అసలు కారణం ఏమిటనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులు సహా అన్ని కోణాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు.
దర్యాప్తులోకి ఎఫ్‌ఏఏ, ఎన్‌టీఎస్‌బీ
ప్రమాదంపై అమెరికా రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ స్పందించారు. పామ్ బీచ్ కౌంటీలో జరిగిన ఈ విమాన ప్రమాదం తీవ్ర విషాదకరమని పేర్కొన్నారు. లియర్‌జెట్ 60లో ప్రయాణిస్తున్న తొమ్మిది మందీ మరణించినట్లు వెల్లడించారు.
ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్‌ఏఏ ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ రవాణా భద్రతా మండలి ఎన్‌టీఎస్‌బీ చేపట్టే దర్యాప్తుకు ఈ బృందం సహకరించనుందని వివరించారు.
ఎఫ్‌ఏఏ కూడా ప్రమాదంపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. దర్యాప్తులో ఎన్‌టీఎస్‌బీ కీలక బాధ్యతలు నిర్వహిస్తుందని, తదుపరి వివరాలను ఆ సంస్థ వెల్లడిస్తుందని స్పష్టం చేసింది. విమానం కూలిపోవడానికి ముందు చోటుచేసుకున్న పరిణామాలు, సాంకేతిక లోపాలు, వాతావరణ పరిస్థితులు సహా అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు.






