అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టీకరణ
ఫ్రాన్స్‌లో మోదీతో భేటీ 

రక్షణ రంగంలో భారత్‌తో అమెరికాకు గొప్ప సంబంధాలున్నాయని, ఒకవేళ భారత్‌పై దాడి జరిగితే తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. ఎవరైనా ఆ దేశంపై దాడి చేయాలనుకుంటే తాము అక్కడే ఉంటామని తేల్చి చెప్పారు. శ్వేతసౌధంలో తానున్నంత కాలం ఆ దేశానికి మంచి మిత్రుడున్నట్లేనని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆశాభావంతో ఉన్నానని తెలిపారు. ‘భారత్‌ ఒక అంతర్జాతీయ శక్తి. ఆ దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం అంతర్జాతీయంగా ప్రతి విషయంలోనూ అది పెద్ద పాత్రే పోషిస్తుంది’ అని ప్రశంసించారు. ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ట్రంప్, మోదీలు బుధవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతోనూ మాట్లాడారు. భారత్‌ నమ్మకమైన భాగస్వామి అని చర్చల సందర్భంగా ట్రంప్‌ వ్యాఖ్యానించారు. తాను భారత్‌లో పర్యటించబోతున్నానని తెలిపారు. అయితే ఎప్పుడు పర్యటించేదీ ఆయన వెల్లడించలేదు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. 

పశ్చిమాసియా జలాల్లో నావికులకు రక్షణ కల్పించాలి..

పశ్చిమాసియా జలాల్లో భారతీయ నావికుల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. వారికి రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇరాన్‌ యుద్ధం కారణంగా నౌకా సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ట్రంప్‌నకు వివరించారు. వారి రక్షణ కోసం విధివిధానాలను రూపొందించాలని కోరారు. ఇటీవల అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయ నౌకా సిబ్బంది మృతి చెందిన నేపథ్యంలో ట్రంప్‌తో ఈ అంశాన్ని మోదీ చర్చించారు. ‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలకు హర్మూజ్‌ జలసంధి తెరిచి ఉంచడం ఎంతో కీలకమని మనం అంగీకరించాం. నౌకల స్వేచ్ఛా ప్రయాణానికి అనుకూల పరిస్థితులను కల్పించాలి. ఈ విషయంలో మనం కలిసి పని చేద్దాం’ అని ట్రంప్‌తో మోదీ అన్నారు. వేలమంది నావికులు అంతర్జాతీయ జలాల్లో పని చేస్తున్నారని, వారి భద్రత ముఖ్యమని ప్రధాని స్పష్టం చేశారు. ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందిన అంశాన్ని ట్రంప్‌ ఎదుట ప్రస్తావించగా.. ఆ విషయం తనకు తెలుసునని, అది ఒక కఠినమైన వృత్తి అని, అందులో ఎలాంటి సందేహం లేదని, కలిసి పని చేద్దామని మోదీతో ట్రంప్‌ పేర్కొన్నారు. 

మోదీ జెయింట్‌ కిల్లర్‌లాంటివారు..

‘‘మోదీ ఎంతో చక్కనివారు. దేవదూతలా చూడటానికి బాగుంటారు. మోదీ చాలా మంచివారని ప్రజలు చెబుతుంటారు. ఆయన కఠినమైన మనిషి. బేరసారాల్లో దిట్ట. జెయింట్‌ కిల్లర్‌లాంటివారు ఆయన భారత ప్రజలను ప్రేమిస్తారు. అమెరికాపైనా ఆయనకు ప్రేమ ఉంది’’ అని ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. ఈ వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో ట్రంప్‌ పక్కనే ఉన్న మోదీ.. నవ్వుతూ కనిపించారు. హెచ్‌1బీ వీసాల్లో కఠిన ఆంక్షలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ఉపాధి పరంగా భారత్‌తో అమెరికాకు అద్భుత సంబంధాలున్నాయని ట్రంప్‌ తెలిపారు.ట్రంప్‌తో సమావేశానంతరం మోదీ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు.