రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
ట్రంప్ హెచ్చరికల్ని పట్టించుకోని ఇజ్రాయెల్
ప్రతిదాడులు.. ఇరాన్ గగనతలం మూత
ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. ఏప్రిల్ 8 తర్వాత మరోసారి ఈ రెండు దేశాల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణలు చెలరేగాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులు ప్రారంభించింది.
ఉత్తర ఇజ్రాయెల్ వైపు దాదాపు పది క్షిపణులు ప్రయోగించబడినట్లు ఇస్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) వర్గాలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఇరాక్‌లోని కొన్ని ప్రాంతాలపై కూడా దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. దీంతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి.
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ ఎదురుదాడులు చేయకూడదని ఆయన సూచించినట్లు అమెరికా వర్గాలు చెబుతున్నాయి. శాంతి ఒప్పందం దాదాపు పూర్తి దశకు చేరుకుందని గుర్తుచేస్తూ, మరింత ఉద్రిక్తతలు సృష్టించే చర్యలకు దూరంగా ఉండాలని రెండు దేశాలకూ సూచించినట్లు తెలుస్తోంది.
అలాగే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (బీబీ)తో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్ , ఇరాన్ దాడుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని, ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రతిదాడి చేయకపోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ తిరిగి దాడులకు దిగితే, గత 47 ఏళ్లుగా కొనసాగుతున్న ఘర్షణల చక్రం మళ్లీ పునరావృతమవుతుందని ఆయన హెచ్చరించినట్లు వెల్లడైంది. అయితే ట్రంప్ సూచనలను ఇజ్రాయెల్ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం నుంచే ఇరాన్‌పై ఇస్రేల్ డిఫెన్స్ ఫోర్సెస్ దళాలు ప్రతిదాడులు ప్రారంభించాయి. పశ్చిమ, మధ్య ఇరాన్‌లోని పలు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇస్రేల్ ఎయిర్ ఫోర్స్ భారీ వైమానిక దాడులు జరిపింది.
ఈ దాడుల ఫలితంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. తబ్రీజ్ , ఇస్ఫాహం వంటి నగరాలు కూడా వరుస పేలుళ్లతో దద్దరిల్లాయి. గగనతలంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన వెంటనే ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఇరాన్‌పై జరిగిన దాడుల ప్రభావంతో ఇప్పటికే కతర్ , సిరియా లు తమ గగనతలాలను మూసివేసినట్లు అక్కడి అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఇజ్రాయెల్ ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ క్షిపణులను ఉపయోగించి దాడులు జరిపిందని ఇరాన్ ఆరోపించింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ భయం మరింతగా పెరిగింది.







