సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): రష్యాకు చెందిన ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్–ఎం (Novostal-M) సంస్థను భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆహ్వానించింది. సెయింట్ పీటర్స్ బర్గ్‌లో నోవోస్టల్–ఎం చైర్మన్ ఇవాన్ డెమ్చెంకోతో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. భారత్‌లో వేగవంతమైన పర్యావరణ అనుమతులు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మౌలిక సదుపాయాల మార్కెట్ మద్దతుతో పరిశ్రమలకు అనుకూల వాతావరణం నెలకొన్నదని లోకేష్ ఈ భేటీలో వివరించారు. ఈ నేపథ్యంలో ఉన్నత శ్రేణి రీబార్, వైర్ రాడ్‌లను తయారుచేసే అత్యాధునిక EAF (Electric Arc Furnace) స్టీల్ ప్లాంట్‌ను భారత్‌లో నిర్మించేందుకు నోవోస్టల్–ఎం ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో తక్షణ రైల్వే సైడింగ్ కనెక్టివిటీతో కూడిన స్ట్రక్చరల్ సెక్షన్, రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లును ఏర్పాటు చేయాలని లోకేష్ ప్రతిపాదించారు. చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ పరిధిలో ఉన్న ప్రాంతీయ ఆటోమోటివ్, షిప్‌బిల్డింగ్ పరిశ్రమలకు నేరుగా ముడి పదార్థాల సరఫరా కోసం ప్రత్యేక హార్డ్‌వేర్ గాల్వనైజ్డ్ వైర్ ఫ్యాక్టరీని ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నోవోస్టల్–ఎం సప్లయ్ చైన్‌ను ఉపయోగించుకుంటూ, ప్రత్యేకమైన వాటర్‌ఫ్రంట్ బెర్త్‌లతో కూడిన ముడి పదార్థాల లాజిస్టిక్స్ హబ్‌ను అభివృద్ధి చేయడానికి జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అవకాశాన్ని కూడా మంత్రి లోకేష్ చర్చించారు. భారత్‌లోని సౌర, పవన విద్యుత్ కారిడార్లతో అనుసంధానం చేస్తూ లో–కర్బన్ ఉక్కు తయారీలో భాగస్వామ్యం వహించాల్సిందిగా నోవోస్టల్–ఎంను కోరారు.

నోవోస్టల్–ఎం చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలపై వివరాలు వెల్లడించారు.

స్టీల్ ప్రొడక్షన్, హోల్ సేల్ మెటల్ ఓర్ వ్యాపారంలో నిమగ్నమైన Novostal-M సంస్థ ఏటా 2.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేసి, 60కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది.

మా సంస్థ మార్కెట్ విస్తరణలో భాగంగా భారతదేశంలోని నిర్మాణ, ఉత్పాదక రంగాలకు సెమీ-ఫినిష్డ్, లాంగ్ స్టీల్ ఉత్పత్తులను భారీ పరిమాణంలో ఎగుమతులపై దృష్టి సారించింది.

మెటలర్జికల్ పోర్ట్‌ఫోలియో, పారిశ్రామిక ఫ్యాబ్రికేటర్లకు ప్రీమియం స్టీల్ బిల్లెట్లు, స్ట్రక్చరల్ రీబార్, హై-స్పీడ్ వైర్ రాడ్లు, ప్రత్యేక వెల్డింగ్ వైర్లను మేము సరఫరా చేస్తున్నాం.

మౌలిక సదుపాయాల సరఫరా వ్యూహంలో భాగంగా జాతీయ రైల్వే, హైవే ప్రాజెక్టుల్లో ముడి పదార్థాల కొరతను నివారించడానికి లాంగ్ స్టీల్, షేప్డ్ రోల్డ్ ఉత్పత్తులను అందిస్తున్నాం. ముంబై, చెన్నై వంటి కీలక జలరవాణా మార్గాల్లో ఇంపోర్ట్ క్లియరెన్సులు, బల్క్ అమ్మకాలను డిస్ట్రిబ్యూషన్ నోడ్స్ సమన్వయం చేస్తున్నాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన పెట్టుబడి, భాగస్వామ్య ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఇవాన్ డెమ్చెంకో తెలిపారు. ఈ భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు, మౌలిక సదుపాయాల రంగాల్లో రష్యా పెట్టుబడులకు మార్గం సుగమం కానున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.