పీఓకే నిరసనకారులు భారత్‌ వంటి శత్రువులే

వారిని చంపడం తప్పులేదు..: పాక్‌ మంత్రి

పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ మరోసారి భారత్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన చేసేవారు భారత్‌ వంటి శత్రువులేనని ప్రేలాపనలు చేశారు. అలాగే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఆందోళనకారులపై కాల్పులు జరపడాన్ని సమర్థించుకున్నారు.

‘‘పీఓకేలో నిరసన చేస్తున్నవారికి, భారత్‌కు మధ్య ఎలాంటి భేదం లేదు. నిరసనకారులతో ఎలాంటి చర్చలకు అవకాశం లేదు. వారు పాకిస్థాన్ శత్రువులు’’ అని స్థానిక టెలివిజన్‌లో ఆసిఫ్‌ మాట్లాడారు. పీఓకే లో జరిగిన తొలి దశ ఎన్నికల్లో హింస చెలరేగడంతో నిషిద్ధ జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ (జేఏఏసీ)కి చెందిన 14 మంది కార్యకర్తలు మృతిచెందారు. భద్రతా దళాలతో జరిగిన ఈ ఘర్షణల్లో 24 మందికి పైగా గాయపడ్డారని కూడా జేఏఏసీ వెల్లడించింది.

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సోమవారం ప్రారంభమైన శాసనసభ ఎన్నికల ప్రక్రియ వచ్చే నెల 10 వరకూ కొనసాగనుంది. మొత్తం 45 సీట్లకు ఇవి జరుగుతున్నాయి. పీవోకేలో వీటిని మూడు దశల్లో నిర్వహిస్తోంది. జులై 27న తొలి విడతలో భాగంగా 13 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ తొమ్మిది చోట్ల విజయం సాధించగా మరో నాలుగు చోట్ల పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (PPP) గెలుపొందినట్లు అక్కడి ఎన్నికల సంఘం ప్రకటించింది. 

ఈ ఎన్నికలపై భారత్ ఇప్పటికే స్పందించింది. ఆ ప్రాంతంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను కప్పిపుచ్చుకునేందుకు చేస్తున్న కపట ప్రయత్నాల్లో అవి భాగమని దుయ్యబట్టింది. పాక్‌ ఆక్రమణలో ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని తేల్చిచెప్పింది.