తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న పాకిస్తాన్, అమెరికా నుంచి 10 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయాన్ని కోరినట్లు వార్తాసంస్థ రాయిటర్స్ వెల్లడించింది. అమెరికా ట్రెఆసురీ కార్యదర్శి స్కాట్ బీసెంట్ కు పంపిన ప్రతిపాదనలో ఐదేళ్ల కాలపరిమితితో ‘బిలాటరల్ ఎక్స్చేంజి స్టెబిలైజషన్ సపోర్ట్ ఫెసిలిటీ’ కింద ఈ సహాయాన్ని కోరినట్లు ఆ నివేదిక పేర్కొంది.

ఇప్పటికే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) నుంచి 7 బిలియన్ డాలర్ల రుణం కోరింది. IMF షరతుల ప్రకారం పన్నుల పెంపు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ, నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టినప్పటికీ, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. దేశీయ కరెన్సీ స్థిరీకరణ, చెల్లింపుల సమతుల్యత సమస్యల పరిష్కారం కోసం అదనపు బాహ్య ఆర్థిక వనరులు అవసరమని పాక్ ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.

అమెరికా సాయం అందితే పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు పెరగడంతో పాటు పాక్ కరెన్సీపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. IMF వంటి బహుళపక్ష ఆర్థిక సంస్థలపై ఆధారపడటం కొంతవరకు తగ్గుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తోంది. ద్వైపాక్షిక ఆర్థిక సహాయం ద్వారా తక్షణ చెల్లింపుల సంక్షోభాన్ని తగ్గించుకోవచ్చని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి.

ఇటీవల పాకిస్తాన్, యునైటెడ్ స్టేట్స్ – ఇరాన్ మధ్యవర్తిత్వాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో తమ దౌత్యపరమైన ప్రాధాన్యత పెరిగిందని పాక్ భావిస్తోంది. ఇలాంటి సమయంలో వాషింగ్టన్ తో ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఇస్లామాబాద్ ప్రయత్నాలు చేస్తున్నట్లు విదేశీ మీడియా విశ్లేషణలు సూచిస్తున్నాయి.

పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ముహమ్మద్ ఔరంగాజీబ్ ఇటీవలి కాలంలో అమెరికా ట్రెఆసురీ సెక్రటరీ తో సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల వల్ల పాక్ ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ఆయన ప్రస్తావించినట్లు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. భద్రతా పరిస్థితులు, ప్రాంతీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో మార్పులు పాక్ ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావాన్ని ఆ సమావేశంలో వివరించినట్లు అధికారిక ప్రకటనల్లో పేర్కొన్నారు.

ప్రస్తుతం పాకిస్తాన్ తన ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు IMF నిధులు, చైనా , సౌదీ అరేబియా వంటి దేశాల ఆర్థిక సహాయం, రుణాలపై ఆధారపడుతోంది. బాహ్య రుణభారం, అధిక ద్రవ్యోల్బణం, తక్కువ పన్ను వసూళ్లు, రాజకీయ అస్థిరతల కలయికతో పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి కోరుతున్న 10 బిలియన్ డాలర్ల సహాయం పాక్ ఆర్థిక పునరుద్ధరణ ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషించవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.