అమెరికా విధిస్తున్న సుంకాలపై (US Tariffs) ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌ (Scott Bessent) కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం (USTR) సెక్షన్‌ 301పై చేస్తున్న దర్యాప్తు పూర్తయితే.. తిరిగి పాత స్థాయిలో ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే సెక్షన్‌ 122 కింద విధించిన 10 శాతం టారిఫ్‌లు జులై 24 వరకు ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉండనున్నాయి. వెట్టిచాకిరీ నిర్మూలనలో విఫలమైనందుకు గానూ భారత్‌ సహా 50కి పైగా దేశాల దిగుమతులపై అదనంగా 12.5 శాతం సుంకం విధించాలని అమెరికా వాణిజ్య కార్యాలయం తన మధ్యంతర నివేదికలో ప్రతిపాదించింది.

వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రపంచ దేశాలపై పరస్పర సుంకాలు ఉపయోగించారని స్కాట్‌ బెసెంట్‌ పేర్కొన్నారు. సెక్షన్ 301 ప్రక్రియ కూడా అదే విధమైన లక్ష్యాన్ని సాధించడానికి చేపట్టినట్లు తెలిపారు. భారత్- అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరో వైపు లండన్‌లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. ఇతర దేశాలపై ప్రయోజనాలను పొందినప్పుడే భారత్‌ ఒప్పందం విషయంలో ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.