నన్ను చంపేస్తారేమో..

అయినా బంగ్లాదేశ్ వెళ్తా: షేక్ హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. 2024లో హింసాత్మక నిరసనల సమయంలో ఆమె భారత్‌కు పారిపోయి వచ్చారు. అప్పటి నుంచి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఇదిలా ఉంటే, 2026 డిసెంబర్‌లో తాను బంగ్లాదేశ్‌కు వెళ్తానని, అక్కడి కోర్టులో లొంగిపోతానని ప్రకటించారు. తనకు మరణశిక్ష విధించినప్పటికీ, తన ప్రాణాలకు ప్రమాదం ఉన్నప్పటికీ, సొంత దేశానికి వెళ్లే నిర్ణయాన్ని మార్చుకోనని చెప్పారు. రాయిటర్స్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

2024 ఆగస్టులో హింసాత్మక నిరసనల సమయంలో పలువురు మరణాలకు, అణచివేతకు షేక్ హసీనా కారణమని ఆమెకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) మరణశిక్ష విధించింది. అయితే, ఈ ఆరోపణల్ని హసీనా తీవ్రంగా ఖండించారు. ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ పలుమార్లు భారత్‌ను కోరింది. ఈ తరుణంలో షేక్ హసీనా నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

‘‘నేను తిరిగి వెళ్తే, నన్ను అరెస్ట్ చేయవచ్చు. వారు నన్ను చంపొచ్చు, అయినా నేను వెళ్లాల్సిందే. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నా పార్టీ నాయకులు, కార్యకర్తలు భయంకరమైన అఘాయిత్యాలను, అణచివేతను ఎదుర్కొంటున్నారు. నేను చనిపోవాల్సి వస్తే, నా తల్లిదండ్రులను ఖననం చేసిన, వారి రక్తం చిందిన నా సొంత గడ్డపైనే అది జరగాలని కోరుకుంటున్నాను.’’ అని ఆమె అన్నారు. షేక్ హసీనాతో పాటు అప్పటి హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ కూడా వెళ్లే అవకాశం ఉంది. తనపై నమోదైన కేసులు రాజకీయ కక్షతో పెట్టినవేనని ఆమె ఆరోపించారు. కోర్టు విచారణ ప్రారంభమైతే నిజం ప్రజలకు తెలుస్తుందని, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు.