రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు మరింత కమ్ముకుంటున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రాంతీయ యుద్ధం దిశగా సాగుతున్నాయి. ఇరాన్ నుంచి అమెరికా స్థావరాలపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారంగా అమెరికా భారీ వైమానిక దాడులు చేపట్టింది. దక్షిణ ఇరాన్‌లోని కీలక ప్రాంతాలపై ‘హెవీ వేవ్’ పేరుతో దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ దాడులతో పాటు ఇరాక్‌లో ఇరాన్ అనుకూల మిలీషియాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త చర్యలు చేపట్టడం, యెమెన్‌లో హౌతీల కదలికలు, హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరగడం.. మొత్తం ప్రాంతాన్ని యుద్ధ వాతావరణంలోకి నెట్టాయి.
ఇరాన్‌లోని రెవల్యూషనరీ గార్డ్ (IRGC)కు చెందిన స్థావరాలే లక్ష్యంగా తాజాగా అమెరికా దాడులు జరిపింది. సైనిక కమాండ్ కేంద్రాలు, మిసైల్, డ్రోన్ సదుపాయాలు, తీర రక్షణ వ్యవస్థలు, సముద్ర కార్యకలాపాలకు సంబంధించిన కేంద్రాలను టార్గెట్ చేసినట్లు అమెరికా వెల్లడించింది. అబాదాన్, బుషెహర్, కిష్, క్విష్మ్ దీవులు, ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. కిష్ దీవిలోని కజెరూన్ ప్రాంతంలోనూ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం.
అమెరికా దాడుల్లో క్విష్మ్ దీవిలోని ఓ నివాస భవనం దెబ్బతింది. మిసైల్ దాడితో భవనం కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి ఇద్దరు చిన్నారులను రక్షించి ఆస్పత్రికి తరలించాయి. మరో ముగ్గురి కోసం శిథిలాల తొలగింపు, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటన యుద్ధంలో పౌర ప్రాంతాలు కూడా ప్రభావితమవుతున్నాయన్న ఆందోళనలను పెంచింది.
ట్రంప్ హెచ్చరికల తర్వాతే దాడులు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా బలగాలపై దాడులకు ప్రతిస్పందన తప్పదని స్పష్టం చేసిన ఆయన.. “ఇప్పుడు కొట్టే వంతు మాది” అనే సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ నుంచి దాడులను ఆపాలని కోరినా అమెరికా చర్యలు తప్పవని ట్రంప్ వ్యాఖ్యానించిన కొద్దిసేపటికే వైమానిక దాడులు ప్రారంభమయ్యాయి. ఇటీవల జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసినట్లు అమెరికా ఆరోపించింది. దీనికి ప్రతీకారంగానే తాజా ఆపరేషన్ చేపట్టినట్లు వాషింగ్టన్ వెల్లడించింది. మరోవైపు ఇరాన్ మాత్రం తమ చర్యలను అమెరికా బెదిరింపులకు ప్రతిస్పందనగా సమర్థించుకుంది. అమెరికా ఒత్తిడి కొనసాగితే ప్రతిఘటన కూడా కొనసాగుతుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ హెచ్చరించింది.
మరోవైపు సౌదీ దాడులు.. తీవ్ర ఉద్రిక్తత..
యుద్ధ ప్రభావం ఇరాక్‌కు కూడా చేరింది. ఇరాన్‌కు అనుబంధంగా ఉన్న మిలీషియా గ్రూపుల స్థావరాలపై అమెరికా, సౌదీ అరేబియా సంయుక్త దాడులు జరిపాయి. ఈ దాడుల్లో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ (PMF)కు చెందిన పలువురు సభ్యులు మరణించినట్లు సమాచారం. కనీసం 20 మంది మృతి చెందినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఇరాక్ ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా ఖండించింది. తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించారని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించింది.
హర్ముజ్ జలసంధిలో పెరుగుతున్న టెన్షన్..
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మరోసారి యుద్ధ కేంద్రంగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై ఇరాన్ ఆంక్షలు విధించడం, అనుమతి లేని మార్గాల్లో వెళ్లే ట్యాంకర్లను అడ్డుకుంటామని హెచ్చరించడం ఉద్రిక్తతలకు కారణమైంది. ఇరాన్ నౌకాదళం మూడు చమురు ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు అమెరికా మాత్రం అంతర్జాతీయ నౌకాయానానికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది. హర్ముజ్‌లో అమెరికా ఆంక్షలను దిక్కరించిన లావిన్ ట్యాంకర్‌పై దాడి జరిగింది. ఇంజిన్ రూమ్‌పై కాల్పులు జరపడంతో నౌక దెబ్బతింది.







