ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026-27 ఆర్థిక సంవత్సరానికి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖలు, కార్యాలయాల్లో ఒక సంవత్సరం పాటు శిక్షణ ఇవ్వడానికి ఈ నియామక ప్రక్రియ చేపట్టింది.

మొత్తం 4,500 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 128, తెలంగాణకు 100 పోస్టులు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులకు 12 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు.

అర్హతల విషయానికి వస్తే, మే 31, 2026 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 01-01-2022 లేదా ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. అప్రెంటిస్ శిక్షణలో పాల్గొనదలచిన అభ్యర్థులు తప్పనిసరిగా NATS పోర్టల్‌లో ముందుగానే నమోదు చేసుకుని ఉండాలి.

వయోపరిమితి మే 31, 2026 నాటికి కనీసం 20 సంవత్సరాలు, గరిష్ఠంగా 28 సంవత్సరాలు. అంటే మే 31, 1998 నుంచి మే 31, 2006 మధ్యలో జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అదనపు వయో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం ఆన్‌లైన్ పరీక్ష, స్థానిక భాషా పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ పరీక్షల ఆధారంగా ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్షను 100 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలకు ఒక గంట సమయం ఉంటుంది. జనరల్/ఫైనాన్స్ అవేర్‌నెస్ 20 ప్రశ్నలు, ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 20 ప్రశ్నలు, కంప్యూటర్ నాలెడ్జ్ 20 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్ 20 ప్రశ్నలు, సెంట్రల్ బ్యాంక్ సేవలపై 20 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు కేటాయించగా, నెగిటివ్ మార్కింగ్ ఉండదు.

శిక్షణ కాలంలో ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.15,000 స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర అలవెన్సులు ఉండవు.

దరఖాస్తు ఫీజు విషయంలో జనరల్, EWS, OBC (పురుషులు) అభ్యర్థులు రూ.944 చెల్లించాలి. జనరల్, EWS, OBC (మహిళలు) అభ్యర్థుల నుంచి రూ.708 వసూలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ట్రాన్స్‌జెండర్ (పురుషులు, స్త్రీలు) అభ్యర్థులు రూ.236 చెల్లించాలి.

దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో మాత్రమే స్వీకరిస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం BFSI SSC పోర్టల్‌లో లాగిన్ అయి దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, సంబంధిత ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలి.

ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ జూన్ 12, 2026 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ జూన్ 22, 2026. ఆన్‌లైన్ పరీక్షను జూలై 2026 మొదటి వారంలో నిర్వహించే అవకాశముంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర నిబంధనలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.