రాయలసీమ న్యూస్, కర్ణాటక డెస్క్: కర్ణాటకలో దారుణం:
వివాహేతర సంబంధం అనుమానంతో భార్య హత్య.. తల్లిదండ్రులకు వీడియో కాల్‌తో ప్రత్యక్ష నరకం!
బాగల్‌కోట్:
వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఒక కట్టుకున్న భర్తే కసాయిగా మారిన ఘోర సంఘటన కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపింది. భార్యను దారుణంగా హతమార్చడమే కాకుండా, ఆమె ప్రాణాలు కోల్పోతున్న చివరి క్షణాలను అత్తమామలకు వీడియో కాల్ చేసి చూపించిన రాక్షసత్వానికి ఒడిగట్టాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగల్‌కోట్ జిల్లాలోని బిలగి తాలూకా, గలగలి గ్రామానికి చెందిన ప్రవీణ్ అశోక్ జిగలూర్ (29) అనే వ్యక్తికి, భాగ్యశ్రీ జిగలూర్ (23) తో వివాహమైంది. వీరికి ఒక సంవత్సరం వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, గత కొంతకాలంగా భార్యపై ప్రవీణ్ అనుమానం పెంచుకోవడంతో ఇద్దరి మధ్య నిరంతరం గొడవలు జరుగుతుండేవి.
నమ్మించి పిలిచి.. అంతమొందించాడు
నిత్యం జరిగే గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన భాగ్యశ్రీ, గత రెండు నెలల క్రితం మహాలింగపూర్‌లోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే, ప్లాన్ ప్రకారం ప్రవీణ్ సోమవారం భార్య పుట్టింటికి వెళ్లి, ఇకపై తామిద్దరం ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవిద్దామని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన భాగ్యశ్రీని తిరిగి తన ఇంటికి తీసుకువచ్చాడు.
వీడియో కాల్‌లో కుమార్తె చివరి క్షణాలు
కానీ, ఇంటికి వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రవీణ్ మళ్లీ ఆమెతో గొడవకు దిగాడు. మొదట ఆమెపై కర్రతో తీవ్రంగా దాడి చేసిన ప్రవీణ్, ఆపై బెడ్‌రూమ్‌లో ఆమె మెడకు గ్రీన్ దుపట్టాతో ఉరి వేశాడు. భాగ్యశ్రీ ఉరికి వేలాడుతూ ఊపిరాడక, ప్రాణాల కోసం కొట్టుకుంటున్న సమయంలో ప్రవీణ్ తీవ్ర రాక్షసానందం పొందాడు. వెంటనే ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి, చనిపోతున్న వారి కుమార్తె చివరి క్షణాలను లైవ్‌లో చూపించాడు. అంతేకాకుండా, ఆ భయానక దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేసి తన స్నేహితులకు, ఇతర బంధువులకు వాట్సాప్‌లో షేర్ చేశాడు.
నిందితుడి అరెస్ట్
ఈ దారుణ దృశ్యాలను చూసి షాక్‌కు గురైన భాగ్యశ్రీ తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిలగి పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని భాగ్యశ్రీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడైన ప్రవీణ్ జిగలూర్‌ను అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేశారు. ఈ కిరాతక ఘటనపై బాగల్‌కోట్ ఎస్పీ సిద్ధార్థ్ గోయల్ పర్యవేక్షణలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు







