చిన్నయ్యతో నాకేంటి సంబంధం?: ప్రకాశ్‌రాజ్‌

ధర్మస్థలలో మృతదేహాలను అనుమానాస్పదంగా ఖననం చేశానని ఇటీవల సంచలన ప్రకటనలు చేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు, ముసుగువ్యక్తిగా పేరుగాంచిన చిన్నయ్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని బహుభాషా నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పష్టం చేశారు. ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కేరళ నుంచి భారీగా నిధులు వచ్చాయని, ఆ విషయమై ప్రకాశ్‌రాజ్‌కు కూడా సమాచారం ఉందని చిన్నయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

బుధవారం బెంగళూరు ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడారు. తాను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ధర్మస్థలకు వెళ్లలేదని, ఆ ఆలయంతో సంబంధం ఉన్న ఎవ్వరినీ కూడా కలిసిన దాఖలాలు లేవని స్పష్టం చేశారు. చిన్నయ్యతో తన పరిచయం ఎలా వచ్చిందన్న దానిపై ఆయన వివరాలు వెల్లడించారు.

మాజీ పోలీసు, ప్రస్తుతం తన సహ కార్యకర్తగా ఉన్న గిరీశ్‌ మట్టణ్ణనవర్‌ ఫోన్‌ చేసి, చిన్నయ్య మీతో మాట్లాడాలని కోరుకుంటున్నాడని చెప్పాడని తెలిపారు. చిన్నయ్య మండ్యకు చెందిన వ్యక్తి అని చెప్పి గిరీశ్‌ ఫోన్‌ ఇచ్చాడని, అయితే చిన్నయ్య తనతో కన్నడలో కాకుండా తమిళంలో మాట్లాడాడని వివరించారు. తనను ప్రత్యక్షంగా కలవాలని చిన్నయ్య కోరడంతో, ఆ భేటీని నిరాకరిస్తూ తాను వాయిస్‌ నోట్‌ పంపిన విషయాన్ని ప్రకాశ్‌రాజ్‌ వెల్లడించారు.

చిన్నయ్య తనతో మాట్లాడిన తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో, ధర్మస్థల ఘటన దర్యాప్తుకు నేతృత్వం వహించిన ఐపీఎస్‌ అధికారి ప్రణబ్‌ మొహంతీకి ఈ విషయాన్ని తెలియజేశానని ఆయన చెప్పారు. ధర్మస్థల ఆలయం ప్రతిష్ఠను దెబ్బతీసేలా వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు బయటపడేందుకు దర్యాప్తు జరపాలని అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ముందుగా తానే కోరినట్టు గుర్తుచేశారు. ఆ తరువాతే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని వివరించారు.

విలేకరుల సమావేశంలో ప్రకాశ్‌రాజ్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు అక్కడి మీడియా ప్రతినిధుల్లో ఆగ్రహాన్ని రేపాయి. ‘అమ్ముడుబోయిన ప్రచార మాధ్యమాలు’ అన్న ఆయన వ్యాఖ్యపై విలేకరులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని గుర్తించిన ప్రకాశ్‌రాజ్‌ వెంటనే వివరణ ఇచ్చారు.

తాను దేవాలయాలకు వెళ్లే వ్యక్తి కాదని, అయితే తన భార్య పరమ భక్తురాలని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. ఆమె నమ్మకాలు, విశ్వాసాలను తాను ఎప్పుడూ ప్రశ్నించలేదని చెప్పారు. సాధారణ పౌరుడిగా ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు తనకుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ధర్మస్థలలో విద్యార్థిని సౌజన్య హత్యాచార ఘటనపై జరుగుతున్న దర్యాప్తు, నిందితులకు కఠిన శిక్ష విధించడం మాత్రమే తన ఆకాంక్ష అని ప్రకాశ్‌రాజ్‌ స్పష్టం చేశారు. ధర్మస్థల ప్రతిష్ఠకు తాను మసి పూయాలని ప్రయత్నిస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు.