రాయలసీమ న్యూస్, కర్ణాటక డెస్క్:
ఆరంకెల జీతం.. వీకెండ్స్‌లో బైక్ ట్యాక్సీ డ్రైవింగ్
ఐటీ రంగం అంటే సాధారణంగా అధిక వేతనం, సౌకర్యవంతమైన జీవితం, వారాంతాల్లో వినోదం, పార్టీలే గుర్తుకొస్తాయి. అయితే పెద్ద నగరాల్లో పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా ఈ చిత్రం మారిపోతోందని ఒక సంఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. బెంగళూరులో పనిచేస్తున్న ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి, ఆరంకెల జీతం పొందుతున్నప్పటికీ, వారాంతాల్లో బైక్ ట్యాక్సీ నడుపుతున్నాడనే విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బెంగళూరులోని బన్నెరఘట్టకు వెళ్లాల్సి వచ్చిన షాబాజ్ అనే వ్యక్తి ఇటీవల బైక్ ట్యాక్సీ సేవను బుక్ చేసుకున్నాడు. ర్యాపిడో సేవ ద్వారా వచ్చిన బైక్ డ్రైవర్‌తో ప్రయాణం ప్రారంభించిన తర్వాత అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. మొదట డ్రైవర్ కన్నడలో మాట్లాడగా, షాబాజ్‌కు ఆ భాష రాకపోవడం గమనించిన అతడు వెంటనే ఇంగ్లిష్‌లో సంభాషణ కొనసాగించాడు.
ప్రయాణం మధ్యలో షాబాజ్ అతడిని ఏమి చేస్తుంటారని అడగగా, డ్రైవర్ తనను సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడని షాబాజ్ వివరించాడు. తన వృత్తి గురించి అడిగినప్పుడు కూడా ఆ డ్రైవర్ తాను సాఫ్ట్‌వేర్ రంగంలోనే పనిచేస్తున్నానని చెప్పాడని పేర్కొన్నాడు.
షాబాజ్ పోస్ట్ ప్రకారం, ఆ వ్యక్తి ఒక ఎంఎన్‌సీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఆరంకెల జీతం వస్తోంది. అయినప్పటికీ వారాంతాల్లో బైక్ ట్యాక్సీ నడుపుతున్నాడు. తనకు పెళ్లయ్యిందని, పిల్లలున్నారని, కుటుంబాన్ని పోషించాలంటే అదనపు ఆదాయం అవసరమని ఆ డ్రైవర్ షాబాజ్‌కు తెలిపినట్లు పేర్కొన్నాడు.
ఈ సంఘటన తనను ఆలోచనలో పడేసిందని షాబాజ్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. ఇంత జీతం పొందుతున్న వ్యక్తి కూడా అదనపు ఆదాయం కోసం ఇలా కష్టపడాల్సి వస్తోందంటే, బెంగళూరు వంటి మహానగరాల్లో జీవించడం ఎంత కష్టంగా మారిందో అర్థమవుతోందని తన పోస్ట్‌లో వ్యాఖ్యానించాడు.
షాబాజ్ పోస్ట్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో నెటిజన్లు విస్తృతంగా స్పందిస్తున్నారు. హైదరాబాద్ వంటి ఇతర నగరాల్లో కూడా చాలా మంది ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉందని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు అదనపు ఆదాయం కోసం బైక్ ట్యాక్సీ వంటి పనులు చేయడం కంటే, కొత్త నైపుణ్యాలు నేర్చుకుని అధిక ఆదాయం వచ్చే అవకాశాలను వెతకాలని సూచిస్తున్నారు.
పెరుగుతున్న ఇళ్ల అద్దెలు, పిల్లల చదువు ఖర్చులు, ఇతర అవసరాల కారణంగా మధ్యతరగతి, ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్నవారి మీద ఆర్థిక భారం పెరుగుతోందని ఈ సంఘటన మరోసారి స్పష్టంచేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.







