రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్:
జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టు ప్రారంభించిన సీఎం చంద్రబాబు
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు. అనంతరం రెండో యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు.
జొన్నగిరి ప్రాజెక్టుకు జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దక్కన్ గోల్డ్‌మైన్స్ లిమిటెడ్ సంస్థలు ఇప్పటి వరకు రూ.405 కోట్లు వెచ్చించాయి. ప్రయోగాత్మకంగా చేసిన ఉత్పత్తి ప్రక్రియ విజయవంతం కావడంతో వాణిజ్యపరంగా బంగారం ఉత్పత్తి చేసే ప్రక్రియను సీఎం ప్రారంభించారు. ప్రైవేటు రంగంలో బంగారం గనుల తవ్వకం, ఉత్పత్తి చేసే ప్రక్రియ ప్రారంభం కావడం దేశంలోనే ఇది మొట్టమొదటిసారి. ప్రపంచంలో బంగారం గనులు, ఉత్పత్తి కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా జొన్నగిరికి అంతర్జాతీయ గుర్తింపు లభించనుంది. ఏటా రెండు టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసేలా జియోమైసూర్ సంస్థ ప్రణాళికలు రచించింది. ఇక్కడ 700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఉత్పత్తి చేసిన బంగారం విలువపై నాలుగుశాతం రాయల్టీ లభించనుంది. తొలి ఏడాది 400 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేయనున్న నేపథ్యంలో సుమారు రూ.57 కోట్లు రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.













