కర్నూలు: పట్టణంలో మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు గురువారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఇంటర్మీడియట్ విద్యార్థులు నడుపుతున్న 20 ద్విచక్ర వాహనాలను గుర్తించి, సంబంధిత నిబంధనల ప్రకారం జరిమానాలు విధించారు.

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. కర్నూలు పట్టణంలోని ఆర్ఎస్ రోడ్డు నుండి మౌర్య Inn మధ్యలో ఉన్న చైతన్య కాలేజీ సమీపంలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు నడుపుతున్న 20 ద్విచక్ర వాహనాలు పట్టుబడ్డాయి. వీటిలో కొన్ని అధిక సీసీ సామర్థ్యం కలిగిన వాహనాలు కూడా ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మైనర్ విద్యార్థులు వాహనాలు నడపడం వల్ల రహదారులపై ప్రమాదాలు పెరిగే అవకాశం ఉండటంతో, ఇలాంటి డ్రైవింగ్‌ను అరికట్టేందుకు ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

మైనర్ విద్యార్థుల తల్లిదండ్రులను ట్రాఫిక్ పోలీసులు స్టేషన్‌కు పిలిపించి, వారికి ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రత, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. తల్లిదండ్రులతో ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించి, పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

రహదారి భద్రతా నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టవిరుద్ధమని, ఇలాంటి చర్యలు తీసుకుంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. యువతలో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.