రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. ఇరవై రోజులుగా పట్టణానికి తాగునీటి సరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో జాతీయ రహదారి పైకి వచ్చి ధర్నా నిర్వహించారు.
తాగునీరు అందక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని, రోజువారీ జీవనం కష్టాల్లో కూరుకుపోయిందని మహిళలు ఆరోపించారు. పట్టణానికి శాశ్వత తాగునీటి పథకాలు అమలు చేసి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఓట్లు అడిగే నాయకులు, తాగునీటి సమస్యపై ప్రశ్నిస్తే "ఇప్పుడు ఇస్తాం, అప్పుడు ఇస్తాం" అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని మహిళలు విమర్శించారు. ఎన్నో సంవత్సరాలుగా తాగునీటి సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ, అధికారులూ, ప్రజాప్రతినిధులూ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.
తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లి బిందెలు నింపుకుని రావాల్సి వస్తోందని, రోజుకు గంటల తరబడి నీటి కోసం క్యూల్లో నిలబడాల్సి వస్తోందని మహిళలు వాపోయారు. చిన్న పిల్లలు, వృద్ధులు, రోగులు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు.
కోడుమూరు పట్టణానికి శాశ్వత తాగునీటి పథకం రూపకల్పన చేసి, వెంటనే అమలు చేయాలని మహిళలు ప్రభుత్వాన్ని కోరారు. తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.













