అక్రమ మద్యం అమ్మకాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ప్రజల నుంచి ఫిర్యాదులు అధికమవుతున్న నేపథ్యంలో ఎకైజ్‌ శాఖ చర్యలు ముమ్మరం చేసింది. కర్నూలు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి వరకు విస్తృత తనిఖీలు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు.

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకైజ్‌ జిల్లా అధికారి సుధీర్‌ బాబు ఆదేశాల మేరకు ఎకైజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణా రెడ్డి పర్యవేక్షణలో కర్నూలు ఎకైజ్‌ స్టేషన్‌ సీఐ చంద్రహాస్‌, ఎస్‌ఐలు రెహనా, మారుతీ ప్రసాద్‌, తేజ తదితరులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు శుక్ర వారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించాయి.

కర్నూలుకు చెందిన సుధాకర్‌ పొరుగు రాష్ట్రం తెలంగాణకు చెందిన మద్యం బాటిళ్లను అక్రమంగా నిల్వ ఉంచి విక్రయాలు జరుపుతున్నట్లు ఎకైజ్‌ అధికారులకు సమాచారం అందింది. దీనిపై స్పందించిన అధికారులు సుధాకర్‌ నివాసం, అతను నిర్వహిస్తున్న ప్రదేశాల్లో తనిఖీలు జరిపి మొత్తం 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే పసుపల గ్రామానికి చెందిన జ్యోతి వద్ద కూడా అధికారులు దాడులు నిర్వహించారు. ఆమె వద్ద నుంచి 7 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు కొంతకాలంగా బెల్టు షాపులు నిర్వహిస్తూ అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు విచారణలో బయటపడినట్లు ఎకైజ్‌ అధికారులు తెలిపారు.

ఈ అక్రమ విక్రయాల నేపథ్యంలో సుధాకర్‌, జ్యోతి మీద సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు కర్నూలు ఎకైజ్‌ స్టేషన్‌ సీఐ చంద్రహాస్‌ వివరించారు. అక్రమ మద్యం నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి మరిన్ని దాడులు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఇక బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై కూడా ఎకైజ్‌ బృందాలు చర్యలు తీసుకున్నాయి. మహబూబ్‌ నగర్‌ జిల్లా దేవకద్రకు చెందిన రఫిక్‌, కల్లూరుకు చెందిన దస్తగిరి, కర్నూలుకు చెందిన బాలకృష్ణతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.

వీరి మీద కూడా సంబంధిత నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యం, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని అక్రమ మద్యం విక్రయాలు, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎకైజ్‌ శాఖ స్పష్టం చేసింది.