రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: తమిళ చిత్రాలతో ప్రతినాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ దాస్ నటించిన తాజా క్రైమ్ కామెడీ చిత్రం ‘కాన్ సిటీ’ ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హరీశ్ దురైరాజ్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించిన ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు ఆడియోతో కూడా అందుబాటులో ఉంది. తమిళంలో విడుదలైనప్పుడు మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందనే ఆసక్తి నెలకొంది.
కథ పరంగా చూస్తే.. శరవణన్ (అర్జున్ దాస్), అతని భార్య మిత్ర (అన్నా బెన్), జాకీ (యోగిబాబు), జానకి (వడివుక్కరసి)ల కుటుంబం మధ్యతరగతి జీవితం గడుపుతూ, కర్ణాటకలోని ఓ మారుమూల గ్రామంలో చిన్న హోటల్ నడుపుతుంది. శరవణన్–మిత్రలకు జీవా (అఖిలన్) అనే దివ్యాంగుడు కుమారుడు. జీవాను కుటుంబమంతా ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. శరవణన్ ప్రతిరోజూ జీవాను స్కూల్‌కు తీసుకెళ్లి తీసుకొస్తాడు.
ఒక రోజు ఆలస్యంగా స్కూల్‌కి చేరుకున్న శరవణన్‌కు, జీవా ఇప్పటికే వెళ్లిపోయాడని స్కూల్ సిబ్బంది చెబుతారు. అనంతరం జీవాను రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ కల్యాణ సుందరం (నందగోపాల్) కిడ్నాప్ చేసినట్టు కుటుంబం గుర్తిస్తుంది. జీవాను ప్రాణాలతో తిరిగి కావాలంటే, తనకు ఎప్పటికీ తరిగిపోని విధంగా డబ్బు వచ్చేలా ప్లాన్ చేయాలని కల్యాణ సుందరం డిమాండ్ చేస్తాడు. ఈ నేపథ్యంలో శరవణన్ అండ్ కో ఏం ప్లాన్ చేస్తారు? కల్యాణ సుందరం వీళ్లనే ఎందుకు ఎంచుకున్నాడు? శరవణన్ కుటుంబం గతంలో ఏం జరిగింది? అన్నది సినిమాతోనే తెలుస్తుంది.
కథలోని మూలభావం మోసం, మోసపోవడం చుట్టూ తిరుగుతుంది. ప్రపంచంలో మనుషులు రెండు రకాలంటూ.. మోసం చేసేవాళ్లు, మోసపోయేవాళ్లు అనే కాన్సెప్ట్‌పై కథ నడుస్తుంది. శరవణన్, మిత్ర, జాకీ, జానకి నలుగురూ గతంలో ఎవరో చేతిలో మోసపోయినవారే. తాము మోసపోయినందుకు, ఇతరులను మోసం చేయడంలో తప్పులేదని భావించే తత్వం వీరిలో కనిపిస్తుంది. చిన్న చిన్న టెక్నిక్‌లతో ఆఫీస్‌లో డబ్బులు తస్కరించడం, రెంటల్ ప్రాపర్టీస్ పేరుతో ఇళ్ల యజమానులను మభ్యపెట్టి ఫేక్ అగ్రిమెంట్‌లు చేయించడం, సోషల్‌మీడియా పోస్టులతో డబ్బులు సంపాదించడం వంటి క్రైమ్ డ్రామా అంశాలు ప్రథమార్ధంలో ఆసక్తికరంగా సాగుతాయి.
‘లక్కీ భాస్కర్’, ‘బ్లఫ్ మాస్టర్’ వంటి చిత్రాల రిఫరెన్స్‌లు కనిపించినా, పాత్రలను ఒకదానితో ఒకటి కలుపుతూ హరీశ్ దురైరాజ్ చేసిన స్క్రీన్‌ప్లే మ్యాజిక్ ఈ సినిమాకు బలం. విరామ సమయానికి వచ్చే ట్విస్ట్ ద్వితీయార్ధంపై ఆసక్తిని పెంచుతుంది. అక్కడి నుంచి కథ మరో కోణం తీసుకుంటుంది. ఒక్కొక్కరూ ఒక్కో మోసం చేసిన ప్రథమార్ధం తర్వాత, ద్వితీయార్ధంలో అందరూ కలిసి ఫేక్ టోల్‌బూత్ ప్లాన్ చేయడం కథను మరో స్థాయికి తీసుకెళ్తుంది.
కొన్ని సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా అనిపించినా, యోగిబాబు ఇరుకునపడే సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. చివరి 20 నిమిషాల్లో వచ్చే ట్విస్ట్‌లు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ముఖ్యంగా జీవా ఇచ్చే ట్విస్ట్, కల్యాణ సుందరంపై శరవణన్, జాకీ దాడి చేసే సన్నివేశాలు ప్రభావం చూపుతాయి. క్రెడిట్ టైటిల్స్ తర్వాత కూడా వచ్చే సన్నివేశాలు సీక్వెల్ సూచనలతో ఆసక్తిని రేకెత్తిస్తాయి.
నటీనటుల విషయానికి వస్తే.. శరవణన్‌గా అర్జున్ దాస్, మిత్రగా అన్నా బెన్, తల్లి–కొడుకుల పాత్రల్లో వడివుక్కరసి, యోగిబాబు తమదైన నటనతో మెప్పించారు. మోసం చేయడానికి వేసే ప్లాన్‌లు, గెటప్‌లు నవ్వులు పంచాయి. ముఖ్యంగా యోగిబాబు నటన సినిమాకు అదనపు బలం. మిగతా నటీనటులు తమ పరిధిలో బాగా చేశారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ సమతుల్యంగా కుదిరాయి. క్రైమ్ కామెడీ జానర్‌లో ఇలాంటి ప్రయత్నాలు వచ్చినా, హరీశ్ దురైరాజ్ ఈ కథను తెరపై ఆవిష్కరించిన తీరు కొంత కొత్తగా అనిపిస్తుంది. అతి తక్కువ పాత్రలతో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకుంటుంది.
బలాల పరంగా నటీనటుల ప్రదర్శన, కథ–దర్శకత్వం, క్లైమాక్స్‌లో ట్విస్ట్‌లు సినిమాను నిలబెట్టాయి. ద్వితీయార్ధంలో కొద్దిగా సాగదీత ఉన్నా, మొత్తం మీద ‘కాన్ సిటీ’ క్రైమ్ కామెడీగా వినోదంతో పాటు ట్విస్ట్‌లతోనూ అలరించే చిత్రంగా నిలిచింది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
రేటింగ్ 3/5







