రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: రాగ్ మయూర్ హీరోగా, మిథిలా పాల్కర్ హీరోయిన్గా నటించిన అనుమాన పక్షి చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డీజే టిల్లు ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అజయ్, రాశీ, బ్రహ్మాజీ, ప్రిన్స్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. చిలుక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్, మేఘన, స్నేహ రాజేష్, విహాన్, హరిచంద్ నిర్మించిన ఈ చిత్రం, The Paradise చిత్రానికి పోటీగా విడుదలైంది.
కథ విషయానికి వస్తే… సన్నీ (రాగ్ మయూర్) ఓ యూట్యూబర్. అతనికి అనుమానాలు అతిగా ఉంటాయి. ఎవరు మాట్లాడినా, ఫోన్‌కు మెసేజ్ వచ్చినా వెంటనే డౌట్ పడతాడు. అతని ఈ స్వభావం వల్ల తల్లిదండ్రులు, స్నేహితులు ఇబ్బందులు పడుతుంటారు. సన్నీ కారణంగా బిజినెస్‌లో నష్టపోయిన ఓ స్నేహితుడు కశ్మీర్లో ఉద్యోగం చేస్తుంటాడు. తన జీవితాన్ని నాశనం చేసిన సన్నీపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని అబద్ధం చెప్పి సన్నీని కశ్మీర్‌కు రప్పిస్తాడు.
కశ్మీర్లో సన్నీకి కన్య (మిథిలా పాల్కర్) పరిచయం అవుతుంది. సన్నీని ప్రేమించిన కన్య, తండ్రిని ఒప్పించి అతనితో పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. ఇదే సమయంలో సన్నీతో కలిసి కశ్మీర్‌కు వచ్చిన అతని స్నేహితుడు వర్మ (ప్రిన్స్) అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతాడు. ఈ హత్యను సన్నీ చేశాడని పోలీస్ ఆఫీసర్ వాసు (అజయ్) భావిస్తాడు. అసలు వాసు కశ్మీర్‌కు ఎందుకు వచ్చాడు? సన్నీని కన్య ఎలా మోసం చేసింది? వర్మ మరణం వెనుక ఉన్న నిజం ఏమిటి? ఈ మర్డర్ కేసు నుంచి సన్నీ ఎలా బయటపడ్డాడు? అన్నదే కథా గమనంగా సాగుతుంది.
నటీనటుల పరంగా రాగ్ మయూర్, అతిగా అనుమానాలు పెట్టుకుని తనకూ, చుట్టుపక్కల వారికీ సమస్యలు సృష్టించే యువకుడి పాత్రలో కనిపించాడు. తన కామెడీ టైమింగ్‌తో నవ్వించే ప్రయత్నం చేసినా, సన్నివేశాలు ఆశించినంతగా పనిచేయలేదు. మిథిలా పాల్కర్ పాత్రను డీజే టిల్లులో నేహా శెట్టి పాత్ర నుంచి దర్శకుడు ఇన్స్పైర్ అయి రాసుకున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆ పాత్రకు అవసరమైన కన్నింగ్, గ్లామర్ ఆమెలో పూర్తిగా కనిపించలేదు. పోలీస్ ఆఫీసర్ వాసుగా అజయ్ కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. సీనియర్ హీరోయిన్ రాశీ అనుభవాన్ని కూడా దర్శకుడు సరిగా వినియోగించుకోలేకపోయాడు. ప్రిన్స్, బ్రహ్మాజీతో పాటు మరికొందరు టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నా, ఎవరి పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉండలేదు.
సాంకేతికంగా చూస్తే, మల్లిక్ రామ్ ఎంచుకున్న కథనే గందరగోళంగా ఉందని అనిపిస్తుంది. రాతలో ఉన్న గజిబిజి, తీతలో కూడా అలాగే కనిపించింది. సినిమా ఆరంభం నుంచి ముగింపు వరకు ఏ పాత్ర ఎందుకు వస్తుంది, తెరపై ఏమి జరుగుతుంది అన్నది స్పష్టంగా అర్థం కాకుండా ఉంటుంది. లవ్ స్టోరీ, మర్డర్ మిస్టరీ, కామెడీ… ఇలా అన్ని జానర్లను కలిపి చూపించే ప్రయత్నం చేసినా, ఏదీ సరిగా ప్రెజెంట్ చేయలేకపోయాడు.
సంగీత విభాగంలో శ్రీచరణ్ పాకాల కంపోజ్ చేసిన పాటల్లో రమణ గోగుల పాడిన సాంగ్ బాగుంది. సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ కశ్మీర్ విజువల్స్‌ను ఎంతో కలర్ఫుల్గా చూపించాడు. మొత్తం చిత్రానికి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే, కశ్మీర్ లొకేషన్స్ ఒక్కటే అని చెప్పొచ్చు.
విశ్లేషణ పరంగా, అనుమాన పెనుభూతం అనే భావన నుంచి కథను ప్రారంభించిన దర్శకుడు, దానికి మర్డర్ మిస్టరీ, లవ్ స్టోరీని జోడించి ఆద్యంతం ఎంటర్టైనింగ్గా చెప్పాలనుకున్నాడు. కానీ కామెడీ సీన్లు, లాజిక్‌లేని సన్నివేశాలు, సీన్‌కు సీన్‌కు లింక్ లేకపోవడం వల్ల సినిమా ఓపికకు పరీక్షగా మారింది. వర్మ మర్డర్ వెనుక ట్విస్ట్‌ను చివరి వరకు దాచినా, అది కూడా సిల్లీగా అనిపిస్తుంది.
గంట యాభై ఒక్క నిమిషాల రన్ టైమ్ ఈ సినిమాకు చిన్నపాటి ప్లస్‌గా చెప్పుకోవచ్చు. క్లైమాక్స్‌లో అనుమాన పక్షికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని వచ్చే డైలాగ్, సినిమా చూసిన ప్రేక్షకులకు కూడా వర్తిస్తుందనే భావన కలిగిస్తుంది.
రేటింగ్: 1/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.






