నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో దళితులను కులం పేరుతో దూషించిన గొట్లూరు సుధాకర్ రెడ్డి పై SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం జాతీయ అధ్యక్షులు రామోజీ ఇమ్మానుయేల్ డిమాండ్ చేశారు. ఈ ఘటన మాల, మాదిగ సామాజిక వర్గాల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన గొట్లూరు సుధాకర్ రెడ్డి నామినేషన్ కేంద్రానికి వెళ్లినప్పుడు, అక్కడ విధుల్లో ఉన్న పోలీసు అధికారుల సమక్షంలోనే ఫోన్‌లో మాట్లాడుతూ దళితులను కులం పేరుతో అవమానించేలా వ్యాఖ్యలు చేసినట్లు రామోజీ ఇమ్మానుయేల్ తెలిపారు.

“అన్న కాపులమా లేక మాల, మాదిగ నాకొడకలమా”

అని గొట్లూరు సుధాకర్ రెడ్డి మాట్లాడిన వీడియో అక్టోబర్ 20, 2026న సోషల్ మీడియా ఫేస్ బుక్‌లో విస్తృతంగా వైరల్ అయ్యిందని, దాంతో మాల, మాదిగ వర్గాల ఆత్మగౌరవం తీవ్రంగా దెబ్బతిన్నదని రామోజీ ఇమ్మానుయేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు వీడియోను ఆధారంగా తీసుకుని, కులం పేరుతో కించపరిచేలా మాట్లాడిన గొట్లూరు సుధాకర్ రెడ్డి పై SC/ST అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ ఘటనపై ఆళ్లగడ్డ అర్బన్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు, సంబంధిత సిఐ కార్యాలయంలో లేరని, ఫిర్యాదును రిజిస్టర్ పోస్టు ద్వారా సిఐకి పంపిస్తామని పోలీసు సిబ్బంది తమకు తెలియజేశారని రామోజీ ఇమ్మానుయేల్ వివరించారు.

ఈ విషయాన్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లేలా చర్యలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. దళితులపై కుల వివక్ష, అవమానకర వ్యాఖ్యలను సహించేది లేదని, న్యాయం కోసం అన్ని చట్టపరమైన మార్గాల్లో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ సంఘాల పరిరక్షణ సమితి స్టీరింగ్ కమిటీ సభ్యులు, కడప జిల్లా దళిత క్రిస్టియన్ మైనార్టీ నాయకులు ఆకుమల్ల ప్రణయ్ కుమార్, రాయసీమ సోషల్ మీడియా జనరల్ సెక్రటరీ E. రాజేష్, ఉయ్యాలవాడ మండలం P. ఓబులేసు, నంద్యాల జిల్లా అధ్యక్షులు M. ఇమ్మనుయేలు బాబు, కడప జిల్లా యువజన నాయకులు రామోజీ మేరింద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.