నంద్యాల పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకులు ఓటర్లపై ఒత్తిడి తేవడం, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను ఇబ్బంది పెట్టడం సరైంది కాదని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు తప్పుడు మార్గాలు మానుకుని, ఓటర్ల మనసు గెలుచుకుని ఓట్లు వేయించుకోవాలని ఆమె సూచించారు.

ఆదివారం నంద్యాల పట్టణంలోని పలు వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల పరిస్థితులను ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి ప్రత్యక్షంగా పరిశీలించారు. నంద్యాల 13వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఖండే శ్యాంసుందర్ లాల్‌ను ఎన్నికల నిర్వహణపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

“వైసీపీ నాయకులు తప్పుడు మార్గం మానుకోండి, ఓటర్ల మనసు గెలుసుకొని ఓట్లు వేయించుకోండి. పోలింగ్ బూతుల వద్ద, క్యూ లైన్ల వద్ద ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండని వైసీపీ నాయకులు అడగడం తప్పు. ప్రశాంతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకునే బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది” అని ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

క్యూ లైన్ల వద్దకే వెళ్లి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్లను “ఫ్యాన్” గుర్తుకు ఓటు వేయమని ఇబ్బంది పెడుతున్నారని, ఈ విధానం వైసీపీకి మంచిది కాదని ఆమె వ్యాఖ్యానించారు. దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్న వైసీపీ నాయకుల ప్రయత్నాలు నంద్యాలలో సఫలం కావని ఎంపి హెచ్చరించారు.

తాను అన్ని వార్డుల్లో తిరుగుతున్నారంటూ వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో స్పందించిన డాక్టర్ బైరెడ్డి శబరి, నంద్యాల ఎంపీగా నంద్యాల పట్టణ ప్రజలు తనను గెలిపించారని, వారి బాగుకోసం, వారు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడం తన బాధ్యత అని తెలిపారు.

“ఎన్నికల నిబంధనలు, నియమావలిని నేను ఎక్కడ ఉల్లంఘించలేదు. వైసీపీ నాయకుల మాదిరిగా నేను నంద్యాలలో ఏ పోలింగ్ బూతులోకి వెళ్లలేదు. వైసీపీ నాయకులే పోలింగ్ బూతుల్లోకి వెళ్లి తంబులాలు తీసుకుంటున్నారు” అని ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి విమర్శించారు.

భారత ఎన్నికల నియమావళిని గౌరవిస్తూ, ఎన్నికల నియమ నిబంధనలు పాటిస్తూ నంద్యాల ఓటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడమే తాను చేస్తున్న పని అని ఆమె స్పష్టం చేశారు.

“నంద్యాల పట్టణంలో నేను పర్యటన చేస్తే వైసీపీ నాయకులు ఎందుకు ఉలుకు?” అని ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి ప్రశ్నించారు.

వైసీపీ నాయకులు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేసే చర్యలకు పాల్పడితే, తాను నిశ్శబ్దంగా ఉండబోనని, ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడే బాధ్యతను నిర్వర్తిస్తానని ఎంపి డాక్టర్ బైరెడ్డి శబరి తన సందేశాన్ని స్పష్టంగా తెలియజేశారు.