నంద్యాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. 52 వార్డులున్న మున్సిపాలిటీలో 52 వార్డులన్నింటిలోనూ వైఎస్సార్‌సీపీ తరఫున అభ్యర్థులను నిలబెట్టామని, నంద్యాలలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మోసపూరిత పాలన, హామీల ఉల్లంఘనలపై ఆయన సమరభేరి మోగించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల పట్టణంలోని 7, 8, 10, 11 వార్డులలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు చిల్లు భాయ్ ఏజాజ్ హుస్సేన్, షేక్ అబ్దుల్ మజీద్, దండే సుధాకర్, షేక్ అబ్దుల్ కలాం బాషా, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి అమీర్ బాష (దాల్మిల్ అమీర్)తో కలిసి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా విస్తృత ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

వైసీపీ అభ్యర్థుల విజయానికి వార్డుల వారీగా పనిచేస్తున్న సీనియర్ వైసీపీ నాయకులందరికీ శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఆయన కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అమలు కాని హామీలను ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదలను, మహిళలను నిలువునా మోసం చేస్తోందని ఆరోపించారు.

నిరుపేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని ఇచ్చిన హామీని కూటమి నాయకులు నిలబెట్టుకోలేదని, ఇప్పుడు అబద్ధాల కరపత్రాలతో ప్రజలను మళ్లీ మభ్యపెట్టాలని చూస్తున్నారని శిల్పా రవి రెడ్డి విమర్శించారు. నంద్యాలలో 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేశామని ప్రచారం చేస్తూ కరపత్రాలు ముద్రించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

“ఎన్నికలు రాగానే కూటమి నాయకులకు మళ్లీ జనం గుర్తుకోస్తారని, నంద్యాలలో 25 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేశామంటూ విచ్చలవిడిగా కరపత్రాలు ముద్రించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన 2 సెంట్ల స్థలం హామీ ఏమైంది? పేదల నడ్డి విరిచి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి ఓటుతోనే ప్రజలు బుద్ధి చెప్పాలి” అని శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఎన్నికల సమయంలో నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను మోసపూరితమైనవిగా శిల్పా రవి రెడ్డి అభివర్ణించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను గాలికొదిలేసి ప్రజలపై తీవ్రమైన భారం మోపారని ఆరోపించారు.

పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని నమ్మించి మహిళలను దారుణంగా మోసం చేశారని ఆయన విమర్శించారు. మహిళలకు నగదు పథకాల పేరుతో ఇచ్చిన హామీలను గుర్తుచేశారు.

“నీకు 15… నీకు 15… నీకు 15” అంటూ మహిళలకు రూ. 15 వేల నగదు పథకం అందిస్తామన్న హామీ ఏమైందో? 50 ఏళ్ల లోపు మహిళలకు ఏడాదికి రూ. 18 వేలు ఇస్తామన్న ప్రకటనలు ఏమయ్యాయి?” అని ఆయన ప్రశ్నించారు.

గత మూడేళ్లుగా ‘సూపర్ సిక్స్’ పథకాలను అమలు చేస్తామని కాలయాపన చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న కూటమి అభ్యర్థులను ఓటు అనే ఆయుధంతో ఓడించి ఇంటికి పంపాలని శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు.

వైఎస్సార్‌సీపీ హయాంలోనే నంద్యాల పట్టణ రూపురేఖలు మారాయని ఆయన స్పష్టం చేశారు. పట్టణంలో 8 నూతన పార్కుల నిర్మాణం, అర్బన్ హెల్త్ సెంటర్లు, మిల్క్ సెంటర్లు అందుబాటులోకి తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ‘నాడు-నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు.

దశాబ్దాలుగా నంద్యాల ప్రజలను వేధిస్తున్న తాగునీటి సమస్యను ‘అమృత్’ పథకం ద్వారా శాశ్వతంగా పరిష్కరించే పనిని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన ఘనత తమదేనని శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధికి పట్టంకట్టిన వైఎస్సార్‌సీపీకి మద్దతుగా నిలిచి, ప్రజా వ్యతిరేక కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ఓటర్లను కోరారు.