రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
బీజేపీ కుట్రలు ప్రజలకు తెలియాలనే ఈ పోరాటం: మీనాక్షి నటరాజన్
తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలోని అధికార బీజేపీ, ఎన్నికల సంఘం (EC) లాలూచీ పడి కుట్రపూరితంగానే తన నామినేషన్‌ను తిరస్కరించాయని ఆమె ధ్వజమెత్తారు. తనపై వస్తున్న ఆరోపణలను మీనాక్షి పూర్తిగా ఖండించారు. తన రాజ్యసభ సీటును అక్రమంగా చోరీ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాకోసం మరొకరితో రాజీనామా చేయించి తెలంగాణలో రాజ్యసభ సీటు తీసుకోలేనని, మధ్యప్రదేశ్‌కు చెందిన వ్యక్తిని కాబట్టే అక్కడి నుంచే సీటు కోరుకుంటానని ఆమె అన్నారు.
నాపై ఎలాంటి లీగల్ కేసులు లేవు
నామినేషన్ పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చానంటూ వస్తున్న వార్తలపై మీనాక్షి నటరాజన్ స్పష్టతనిచ్చారు. 'నాపై ఎలాంటి లీగల్ కేసులు లేవు. అసలు నామినేషన్ పత్రంలో 'లీగల్ నోటీస్'కు సంబంధించిన ప్రత్యేక కాలమ్ ఎక్కడా లేదు. లేని కాలమ్‌ను సాకుగా చూపి, సాంకేతిక కారణాల పేరుతో నా నామినేషన్‌ను తిరస్కరించడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం' అని ఆమె మండిపడ్డారు. కావాలనే బీజేపీ తనపై అబద్ధాలు సృష్టిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.







