రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
అధికారమే లక్ష్యంగా తెలంగాణలో పోరాడాలి
: భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా తెలంగాణలోని పార్టీ శ్రేణులు పోరాడాలని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. ప్రజాపోరాటాలు చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లా భాజపా కార్యాలయాలను నితిన్ నబీన్ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘‘ప్రజాసేవ, పోరాటాల ద్వారానే రాష్ట్రంలో అధికారంలోకి రాగలం. పార్టీని అధికారంలోకి తీసుకొస్తామని ప్రతి కార్యకర్త సంకల్పం తీసుకోవాలి. పశ్చిమ బెంగాల్‌లో కార్యకర్తల కృషితోనే భాజపా ఘన విజయం సాధించింది. అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ పోరాడాలి. త్వరలో ఈ రాష్ట్రంలోనూ కాషాయ జెండా ఎగరాలి. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. లోక్‌సభలో రెండు సీట్లతో ప్రారంభమైన భాజపా.. ఇప్పుడు అప్రతిహతంగా సాగుతోంది. తెలంగాణ ఏర్పాటు కోసం సుష్మాస్వరాజ్ ఎంతో పోరాడారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న భాజపా వల్లే తెలంగాణ కల సాకారమైంది’’ అని నితిన్ నబీన్ అన్నారు.







