దేశ రాజధాని దిల్లీలో మహిళా ప్రొఫెసర్ హత్య కేసు సంచలనంగా మారింది. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన దంపతులు దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణించి దిల్లీకి చేరుకుని, అక్కడ నివాసం ఉంటున్న మహిళా ప్రొఫెసర్‌ను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. మూడు రోజుల్లోనే ఈ కేసును పోలీసులు ఛేదించి నిందిత దంపతులను అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దేబోస్మితా పాల్ దిల్లీలోని శివాజి కాలేజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. తూర్పు దిల్లీలోని వసుంధర ఎనక్లేవ్ ప్రాంతంలో ఉన్న సత్యం అపార్ట్మెంట్స్ లో ఆమె ఒంటరిగా నివసిస్తున్నారు. పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన ఓ దంపతులకు దేబోస్మితాతో పాత ఆస్తి వివాదం ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అదే కారణంగా ఆమెను హతమార్చాలని ఆ దంపతులు పథకం వేసినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆ దంపతులు తమ చిన్నారితో కలిసి పశ్చిమ్ బెంగాల్ నుంచి దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణించి దిల్లీకి చేరుకున్నారు. జూన్ 3న మాస్కులు ధరించి సత్యం అపార్ట్మెంట్స్ లోని దేబోస్మితా ఫ్లాట్‌కు వెళ్లారు. ఫ్లాట్‌కు చేరుకున్న తర్వాత చిన్నారిని బయటే ఉంచి, భార్యాభర్తలు ఇద్దరూ లోపలికి ప్రవేశించారు.

అక్కడ దేబోస్మితా తలపై బరువైన వస్తువుతో బలంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె మణికట్టు నరాలను కట్ చేసి, ఫ్లాట్‌ను బయట నుంచి తాళం వేసి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో దేబోస్మితా అక్కడికక్కడే మృతి చెందినట్లు దర్యాప్తులో బయటపడింది.

ఘటన జరిగిన సమయానికి దేబోస్మితా సోదరి దేవరతి పలుమార్లు ఆమెకు ఫోన్ చేసినా స్పందన రాలేదని పోలీసులు చెప్పారు. అనుమానం వచ్చిన దేవరతి నేరుగా ఫ్లాట్‌కు వెళ్లి చూడగా తలుపుకు తాళం వేసి ఉండటం గమనించింది. తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూసే సరికి దేబోస్మితా రక్తపు మడుగులో పడిఉండగా కనిపించిందని విచారణలో వెల్లడైంది.

సమాచారం అందుకున్న న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్ పరిసరాల్లో ఉన్న CCTV ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు, నిందిత దంపతులు ప్రయాణించిన ప్రైవేట్ క్యాబ్ వివరాలను సేకరించారు. ఆ ఆధారంగా వారి కదలికలను ట్రేస్ చేసి, చివరకు పశ్చిమ్ బెంగాల్‌లోని బర్ధమాన్ ప్రాంతంలో ఆ దంపతులను అరెస్ట్ చేశారు.

ఈ హత్య కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆస్తి వివాదానికి సంబంధించిన అన్ని కోణాలను పరిశీలిస్తున్నట్లు, నిందితులను మరింత విచారిస్తున్నట్లు తెలిపారు. దేబోస్మితా కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, ఆస్తి పత్రాలు, పాత విభేదాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు.