రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
పుణె బిజినెస్‌మ్యాన్ మృతి కేసులో కొత్త ట్విస్ట్
మహారాష్ట్రలోని పుణెలో కాబోయే భార్యను ఫొటో తీస్తూ లోయలో పడి బిజినెస్‌మ్యాన్ కేతన్ విశాల్ అగర్వాల్ మృతిచెందిన ఘటన కీలక మలుపు తిరిగింది. అది ప్రమాదం కాదని, ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కేతన్‌ను అతడి కాబోయే భార్యే చంపేసినట్లు అనుమానిస్తున్నారు. దీంతో ఈ ఘటనను హత్య కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
26 ఏళ్ల కేతన్ అగర్వాల్ (Ketan Vishal Agarwal) జూన్ 18న చారిత్రక లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. తాము ట్రెక్కింగ్‌కు వచ్చామని, కేతన్ తనను ఫొటోలు తీస్తుండగా హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని అతడి కాబోయే భార్య నాడు పోలీసులకు తెలిపారు. దీంతో ప్రమాదంగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
అయితే, విచారణ సమయంలో కేతన్ కాబోయే భార్య పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ తర్వాత దర్యాప్తు చేయగా అతడిది హత్య అని ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ కేసులో కేతన్ కాబోయే భార్య, ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. వీరే అతడిని లోయలోకి తోసి, ఆ తర్వాత ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న మరో ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేతన్ మృతిని హత్య కేసుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్ తన కుటుంబ స్థిరాస్తి వ్యాపార కంపెనీలో డైరెక్టరుగా ఉన్నారు. ఇటీవలే అతడికి వివాహం నిశ్చయమైంది. నవంబరులో జరిగే పెళ్లి వేడుక కోసం ఉదయ్‌పుర్‌లోని ఖరీదైన ప్యాలెస్‌ను కూడా బుక్ చేశారు. జూన్ 19న కాబోయే భార్య పుట్టినరోజు ఉండటంతో ఆ వేడుకల కోసం కేతన్ కొంతమంది మిత్రులతో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లారు. అక్కడే ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.







