గుజరాత్‌లోని కచ్ జిల్లా గాంధీధామ్‌లో నేపాల్‌కు చెందిన హిందూ మహిళ సోనమ్ సునార్ హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నేపాల్ నుంచి వచ్చిన సోనమ్, గాంధీధామ్‌లో నివసిస్తున్న సుల్తాన్ జుసాబ్ సుమ్రాను ప్రేమించి 2011లో వివాహం చేసుకుంది. వివాహం అనంతరం కొంతకాలం దంపతుల జీవితం సజావుగా సాగినప్పటికీ, తరువాత పరిస్థితులు మారాయి.

సోనమ్ తన బంధువులతో సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని భర్త సుల్తాన్ నిరంతరం ఒత్తిడి చేయడంతో పాటు వేధింపులకు పాల్పడుతున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో, భర్త తనను తీవ్రంగా కొడుతున్నాడని, తన ప్రాణాలకు ముప్పు ఉందని సోనమ్ జూలై 12న తన కజిన్‌కు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం.

భార్య భర్తల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో సుల్తాన్ సోనమ్‌ను దారుణంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అనంతరం సోనమ్ మూర్ఛ వ్యాధితో కిందపడి చనిపోయిందని భర్త నాటకమాడినట్లు విచారణలో బయటపడింది.

సోనమ్ మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించిన సమయంలో, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహంపై తీవ్రమైన గాయాలు కనిపించడంతో, ఇది సహజ మరణం కాదని అనుమానించిన పోలీసులు కేసును నమోదు చేసి మరింత దర్యాప్తు ప్రారంభించారు.

తదుపరి విచారణలో భాగంగా సోనమ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జామ్‌నగర్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షలో సోనమ్ శరీరానికి తగిలిన బహుళ గాయాల వల్లే మరణం సంభవించినట్లు వైద్యులు నిర్ధారించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ఈ ఘటనపై గాంధీధామ్ ప్రాంతంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నేపాల్‌కు చెందిన హిందూ మహిళపై జరిగిన ఈ దాడి, హత్యపై స్థానిక మహిళా సంఘాలు స్పందిస్తున్నాయి. సోనమ్ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని, దోషికి కఠిన శిక్ష విధించాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

సోనమ్ హత్య కేసులో సుల్తాన్ జుసాబ్ సుమ్రా పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదిక, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు, స్థానికుల సమాచారం ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్తున్నట్టు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.