గంగానదిలో పడవపై చికెన్ వండి బీర్ పార్టీ.. వారణాసిలో ఐదుగురు అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గంగానదిలో పడవపై చికెన్ వండి బీర్ సేవించిన ఘటన పెద్ద దుమారమే రేపింది. ఈ దృశ్యాలు కలిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. పవిత్ర గంగానదిలో ఇలాంటి చేష్టలకు పాల్పడటం మతపరమైన మనోభావాలను దెబ్బతీసే చర్యగా స్థానికులు, భక్తులు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

దశాశ్వమేధ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అతుల్ అంజన్ త్రిపాఠి తెలిపిన వివరాల ప్రకారం, వారణాసిలో గంగానదిలో పడవపై చికెన్ వండి బీర్ తాగుతున్నట్లు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే విచారణ ప్రారంభించారు. వీడియోలో కనిపించిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు, ఘటనలో ఉపయోగించిన పడవను కూడా స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారిని దీపక్ కుమార్, అజయ్ సాహ్ని, అరుణ్ కుమార్ సాహ్ని, అనురాగ్ నిషాద్, రాహుల్ సాహ్నిలుగా గుర్తించారు. వీరి వయస్సు 25 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉందని పోలీసులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోలో గంగానది మధ్యలో పడవపై కూర్చున్న యువకులు చికెన్ వండుతూ, బీర్ సేవిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారణాసి నగరం, గంగానది హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలుగా భావిస్తారు. ఈ నేపథ్యంలో గంగానదిలో పడవపై బీర్ పార్టీ నిర్వహించడం మతపరమైన భావాలను దెబ్బతీసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు వెల్లువెత్తాయి.

ఇదిలా ఉండగా, వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఇటీవల మరో కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర శ్రావణ మాసం ప్రారంభానికి ముందు నగర పరిధిలోని అన్ని మాంసం, చేపలు, పౌల్ట్రీ దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది. ప్రస్తుతం నగరంలో 350 నుంచి 400 వరకు మాంసం, చేపలు, పౌల్ట్రీ దుకాణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

ఈ దుకాణాల కోసం రామ్‌నగర్, సుజాబాద్, గణేశ్‌పూర్, అవలేశ్‌పూర్, శివ్‌పూర్ ప్రాంతాల్లో ఐదు ప్రత్యేక ప్రదేశాలను గుర్తించారు. ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నగరంలోని మాంసం దుకాణాలు మూసివేయాల్సి రావడంతో వ్యాపారులు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారని అధికారులు పేర్కొన్నారు. దుకాణాలను నగర శివార్లకు తరలించడం ద్వారా వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగించేందుకు అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు.

అయితే ఈ నిర్ణయంపై స్థానిక ప్రజలు, వ్యాపారులు, రాజకీయ నాయకుల నుంచి మద్దతుతో పాటు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. గంగానదిలో జరిగిన తాజా ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.