రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
కూడంకుళం అణు ప్లాంట్‌కు ఢోకా లేదు! :
ప్రకటించిన న్యూక్లియర్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్ర ప్రాజెక్ట్ అయిన తమిళనాడులోని కూడంకుళం ప్లాంట్ లో డేటా లీకేజీ జరిగినట్లు వచ్చిన వార్తలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) స్పందించింది. బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్‌కు చెందిన ఫైళ్లు లీకయ్యాయని (Data Leak) తెలిపింది. అణు భద్రత వ్యవస్థలకు సంబంధించిన వివరాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది.
‘‘కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్ట్ (KKNPP) 3, 4 యూనిట్లకు సంబంధించిన డేటా లీకైనట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే లీకైన ఈ డేటా బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్‌కు చెందినది. ఈ యూనిట్లలో నిర్మాణ సంబంధిత సేవల కోసం 2018లో పబ్లిక్ టెండర్ ప్రక్రియ ద్వారా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అప్పగించాం. థర్మల్ పవర్ ప్లాంట్స్, ఇతర పరిశ్రమల్లో మాదిరిగానే ఈ విభాగం.. ఇంజినీరింగ్, సరఫరా, నిర్మాణ వంటి సాధారణ సేవలే నిర్వహిస్తోంది. దీనికి అణు భద్రతా వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేదు. అణు భద్రతకు సంబంధించిన సమాచారమంతా రహస్యంగానే ఉంది. ఇందులో ఎలాంటి లీకేజీ జరగలేదు’’ అని ఎన్‌పీసీఐఎల్ (NPCIL) వెల్లడించింది.
కూడంకుళం అణు కేంద్రానికి చెందిన ఫైళ్లు లీకైనట్లు ఇటీవల అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ప్లాంట్‌లోని బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్‌కు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్‌గా ఉంది. అయితే, ఈ కంపెనీకి సంబంధించిన థర్డ్ పార్టీ డేటా సెంటర్‌పై సైబర్ దాడి జరిగినట్లు సమాచారం. ఇందులో తాము భద్రపర్చిన డేటా పాక్షికంగా లీకైందని, ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేశామని కంపెనీ చెప్పినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఈ సంస్థకు చెందిన మొత్తం 8.6లక్షల ఫైళ్లు డార్క్‌వెబ్‌లో కన్పించినట్లు సమాచారం. ఇందులో 19వేల ఫైళ్లు కుడంకుళం ప్రాజెక్టుకు చెందినవిగా తెలిసింది. లీక్ అయిన వాటిలో 3, 4 యూనిట్లలో ఉపయోగించిన వెంటిలేషన్, కూలింగ్ సిస్టమ్స్‌కు సంబంధించిన బ్లూప్రింట్లు ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
కూడంకుళంలో భారత్‌లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ ప్రాజెక్టు రష్యా చేపట్టింది. ఇప్పటికే ఆరు రియాక్టర్లకు గాను రెండు వినియోగంలో ఉండగా.. మరో నాలుగు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.







