న్యూఢిల్లీ : నేపాల్ విదేశాంగ శాఖ మంత్రి శిశిర్ ఖనల్ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం శుక్రవారం భారత్‌కు రానున్నారు. నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకునే ఆయన పర్యటన జూన్ 5 నుంచి 7 వరకు కొనసాగనుంది. భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు శిశిర్ ఖనల్ ఈ పర్యటన చేపడుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడం, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

పర్యటనలో భాగంగా ఈ రోజు రెండు దేశాల విదేశాంగ మంత్రులు అధికారిక చర్చలు జరపనున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ప్రజల మధ్య సంబంధాల పెంపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు దౌత్య వర్గాలు సూచిస్తున్నాయి. 2026 ఏప్రిల్‌లో నేపాల్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శిశిర్ ఖనల్‌కు భారత్ నుంచి వచ్చిన ఇదే మొదటి అధికారిక ఆహ్వానం కావడం విశేషంగా నిలిచింది. దీంతో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది.

ఇటీవలి సంవత్సరాల్లో భారత్–నేపాల్ దేశాల మధ్య సరిహద్దు వివాదాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సరిహద్దు సమస్యల నేపథ్యంతోనే శిశిర్ ఖనల్ పర్యటనను రెండు దేశాల దౌత్య వర్గాలు కీలకంగా చూస్తున్నాయి.కొద్దిరోజుల క్రితం నేపాల్ నూతన ప్రధాని బాలేంద్ర షా కూడా రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంపై నేపాల్ పార్లమెంట్‌లో వ్యాఖ్యానించారు. భారత్, నేపాల్ రెండూ పరస్పరం ఆక్రమించిన భూభాగాలపై అధ్యయనం చేసి, స్నేహపూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మీరు ఈ వాస్తవం తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఈ విషయం నాకు ఇటీవలే తెలిసింది. భారత్ మాత్రమే నేపాల్ భూభాగాల్ని ఆక్రమించలేదు. నేపాల్ కూడా అదే పని చేసింది. అనేక చోట్ల భారత భూభాగాల్ని ఆక్రమించింది. రెండు దేశాలు ఈ ఆక్రమణలను అధ్యయనం చేసి స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శిశిర్ ఖనల్ ఢిల్లీ పర్యటన, ఆయన ఎస్ జయశంకర్‌తో జరిపే చర్చలు సరిహద్దు వివాదాల పరిష్కార దిశగా ఏ మేరకు దోహదపడతాయన్న దానిపై రెండు దేశాల్లోనూ ఆసక్తి నెలకొంది. ద్వైపాక్షిక సంబంధాల పునర్‌వ్యవస్థీకరణ, పరస్పర విశ్వాసం పెంపు, ఆర్థిక–దౌత్య సహకారం విస్తరణ వంటి అంశాల్లో ఈ పర్యటన ఫలితాల కోసం దౌత్య వర్గాలు ఎదురుచూస్తున్నాయి.