పహల్గాం దాడి ఉగ్రవాది ఎన్‌కౌంటర్‌..

తోటలో నక్కి ఉండగా కాల్చిచంపిన సైన్యం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్‌ చేపట్టిన భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. షోపియాన్‌లో ఓ పండ్ల తోటలో నక్కిన ఉగ్రవాదుల్లో ఒకడిని బుధవారం హతమార్చాయి. మృతుడిని లష్కరే తయ్యిబా టాప్‌ కమాండర్‌ జాకిర్‌ అహ్మద్‌ గనీగా గుర్తించారు. అతడికి పహల్గాం ఉగ్రదాడితో సంబంధాలున్నట్లు దర్యాప్తు వర్గాల సమాచారం.

షోపియాన్‌లోని ఓ పండ్ల తోటలో ఉగ్రవాదులు నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఇటీవల నిఘా కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్‌ దళాలు జులై 3న సంయుక్త ఆపరేషన్‌ చేపట్టాయి. ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని నలుమూలల నుంచి దిగ్బంధించి వేట మొదలుపెట్టాయి. దాదాపు ఐదు రోజులుగా కొనసాగుతోన్న ఈ ఆపరేషన్‌లో బుధవారం ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. భద్రతా బలగాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో సిబ్బంది ఎదురుకాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.

అనంతరం ఘటనాస్థలంలో ఓ ఉగ్రవాది మృతదేహాన్ని గుర్తించారు. అతడిని జాకిర్‌ అహ్మద్‌ గనీగా తేల్చారు. అతడితో పాటు ఉన్న మరో ఉగ్రవాది లతీఫ్‌ భట్‌ కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి. అతడు బయటకు వెళ్లకుండా తోట చుట్టూ విక్టర్‌ ఫోర్స్‌ దళాలు మోహరించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌పై జమ్మూకశ్మీర్‌ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘మీరు పారిపోవచ్చేమో.. కానీ దాక్కోలేరు’’ అని ఉగ్రవాదులను హెచ్చరించారు.

ఎవరీ జాకిర్‌ గనీ..

కుల్గామ్‌కు చెందిన జాకిర్‌ గనీ.. కొన్నేళ్లుగా లష్కరే తయ్యిబా ముఠాలో కీలకంగా పనిచేస్తున్నాడు. గతంలో భద్రతా సిబ్బందిపై దాడులు, పౌరుల హత్యల కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. అప్పటి నుంచి అతడిపై నిఘా వర్గాలు దృష్టిపెట్టాయి. 2025 ఏప్రిల్‌లో పహల్గాంలో చోటుచేసుకున్న భీకర ఉగ్రదాడి ఘటనపై దర్యాప్తు సమయంలోనూ జాకిర్‌ పేరు వినిపించింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా జాకిర్‌కు సంబంధించిన ఓ ఇంటిని కూడా కూల్చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.