రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
రాజస్థాన్‌లో బస్సు ప్రమాదం..
మంటల్లో 8 మంది దుర్మరణం
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై ధనవాడ సమీపంలో బుధవారం తెల్లవారుజామున స్లీపర్ బస్సు ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టడంతో బస్సులో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 29 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, స్థానిక సమాచారం ప్రకారం, రిషికేష్ నుంచి ఇందౌర్ వెళ్తున్న స్లీపర్ బస్సు బుధవారం ఉదయం సుమారు 2.30 గంటల సమయంలో ధనవాడ సమీపంలో ముందుకు వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగి క్రమంగా మొత్తం వాహనాన్ని ఆవరించాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు నిద్రలో ఉండటంతో బయటకు రావడానికి అవకాశం తక్కువగా ఉండిపోయింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనమయ్యారు . మిగతా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, హైవే అథారిటీ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తీసుకుని, బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు సాగించారు. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో రక్షణ చర్యలు కష్టసాధ్యంగా మారినట్లు సమాచారం.
ఈ ఘటనపై దౌసా జిల్లా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ప్రమాదం సమయంలో బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా, వాహనాల వేగం ఎంత, ట్రక్కు అకస్మాత్తుగా బ్రేకులు వేసిందా వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు, ట్రక్కు డ్రైవర్లపై నిర్లక్ష్యంపై కేసులు నమోదు చేసే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
దిల్లీ - ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ఘటనతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. తరువాత వాహనాలను పక్కకు తొలగించి రహదారిపై రాకపోకలను సాధారణ స్థితికి తీసుకువచ్చారు. ప్రమాదంపై స్థానిక పరిపాలన, రవాణా శాఖ అధికారులు నివేదికలు సేకరిస్తున్నారు.







