కుల రిజర్వేషన్ రద్దుపై డిజిటల్ ఉద్యమం:

దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువైన ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’

అభిజీత్ దేప్కే ప్రారంభించిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కేవలం రెండు నెలల్లోనే దేశంలోని జెన్-జీ (Gen-Z) యువతను తన వైపు తిప్పుకుంది. విద్యా వ్యవస్థలోని లోపాలపై పోరాటానికి యువతను ఏకం చేసి, వ్యంగ్యాన్ని రాజకీయ ఆయుధంగా మలచిన ఈ పార్టీ, సరైన సమస్యను ఎంచుకుంటే వ్యంగ్యం కూడా ఎంతటి శక్తివంతమైన రాజకీయ సాధనమవుతుందో రుజువు చేసింది. CJP విజయానంతరం ఇంటర్నెట్ వేదికగా అనేక అంశాల ఆధారిత డిజిటల్ ఉద్యమాలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, నిమిషాల్లోనే వేలాదిమంది మద్దతును కూడగట్టుకుంటున్నాయి.

ఈ కొత్త తరహా డిజిటల్ ఉద్యమాల్లో కొన్ని సరదాగా ప్రారంభమైన ‘దారు జనతా పార్టీ’, ‘కబూతర్ జనతా పార్టీ’ వంటి ఖాతాలు కాగా, మరికొన్ని తీవ్రమైన ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నాయి. ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వినియోగంపై వ్యక్తమవుతున్న అసంతృప్తికి గళమెత్తుతున్న ‘E20 జనతా పార్టీ’ ఒక వైపు ఉంటే, మరో వైపు కుల ఆధారిత రిజర్వేషన్లపై ప్రశ్నలు లేవనెత్తుతున్న ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ (RHA) ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా దూసుకుపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

పేరుకు తగ్గట్టుగానే కుల ఆధారిత రిజర్వేషన్లను, కుల గణనను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఈ డిజిటల్ ఉద్యమం ముందుకు సాగుతోంది. గడిచిన వారం రోజులుగా విద్యార్థుల నిరసనలతో దేశం అట్టుడికిపోతున్న నేపథ్యంలో, ఈ ఖాతా నెమ్మదిగా, సైలెంట్‌గా విస్తరించింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఖాతాకు 58 లక్షలకు (5.8 మిలియన్లు) పైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ వంటి ప్రధాన రాజకీయ పార్టీల ఫాలోవర్ల కంటే ఈ సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం.

కులాతీత సమాజం, ప్రతిభ ఆధారిత అవకాశాలను లక్ష్యంగా పెట్టుకుని ఈ ఖాతా ముందుకు సాగుతోంది. దాదాపు 120కి పైగా పోస్టులు ఉన్న ఈ ఇన్‌స్టాగ్రామ్ పేజీ, కేవలం ఒకే ఒక్క ఖాతాను – ‘Indian Army’ని మాత్రమే ఫాలో అవుతోంది. ఖాతా బయోలో తమ ఉద్యమ లక్ష్యాన్ని స్పష్టంగా పేర్కొన్నారు.

“రిజర్వేషన్ రాజకీయంలో నష్టపోయిన పౌరుల మద్దతుతో.. ప్రతిభే ప్రామాణికంగా నడిచే ఉద్యమం”

అంతేకాక ప్రముఖ కవి దినకర్ రచనలోని పంక్తులను కూడా ఈ పేజీలో ఉటంకించారు.

“సద్గుణాలు, స్వయం క్రమశిక్షణ ద్వారానే గౌరవం లభిస్తుంది. కేవలం పిరికివారు, క్రూరులు మాత్రమే నిరంతరం కులం గురించి మాట్లాడతారు.”

ఆసక్తికరమైన అంశమేమిటంటే, కుల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నప్పటికీ ఈ ఉద్యమం డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఇచ్చిన ప్రసిద్ధ పిలుపు “బోధించు, సమీకరించు, పోరాడు” అనే సూత్రాన్ని తన ప్రచారంలో ఉపయోగిస్తోంది. వీరి లోగోపై “సమానత్వం, ప్రతిభ, న్యాయం” అనే నినాదం కనిపిస్తుంది. 1942లో నాగ్‌పూర్‌లో జరిగిన సమావేశంలో కుల వివక్షను అణచివేయడానికి అంబేడ్కర్ ఈ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ వెనుక ఎవరున్నారనేది ఇప్పటికీ గోప్యంగానే ఉంది. తమకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని ఈ ఖాతా ప్రకటించుకుంది. ఒక పోస్టులో రిజర్వేషన్ వ్యవస్థపై తమ అభిప్రాయాన్ని వెల్లడించింది.

“ప్రభుత్వం మారితే రిజర్వేషన్ వ్యవస్థలో మార్పులు వస్తాయని ఒకప్పుడు భావించాం, కానీ BJP కూడా విఫలమైంది”

రిజర్వేషన్లు పూర్తిగా తొలగించాలనే డిమాండ్‌ను ఈ ఉద్యమం పెట్టడం లేదు. దివ్యాంగులు, అనాథ పిల్లలు, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల పిల్లలు, మతం, కులంతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబడిన పేదలకు మాత్రమే రిజర్వేషన్లు పరిమితం కావాలని ప్రతిపాదిస్తోంది. ప్రస్తుతం దేశంలో రిజర్వేషన్లు 50 శాతం పరిమితిలో ఉండగా, దాన్ని పెంచాలని కొన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్న సమయంలో ఈ డిజిటల్ మూవ్‌మెంట్ ముందుకు రావడం ప్రత్యేకంగా నిలుస్తోంది.

గుర్తింపు అనేది కులం ఆధారంగా ఉండకూడదని, ప్రభుత్వ దరఖాస్తులు, ఉద్యోగ, విద్యా సంబంధిత ఫారమ్‌లలో కులాన్ని ప్రకటించే విధానాన్ని పూర్తిగా ఎత్తివేయాలని ఈ ఉద్యమం కోరుతోంది. వీరి అంతిమ లక్ష్యం “ఒకే దేశం.. ఒకే గుర్తింపు” అనే నినాదంలో ప్రతిఫలిస్తోంది.

సమాజంలో ఉన్న అసంతృప్తిని సరైన సమయంలో ప్రశ్నించడం వల్లే కాక్రోచ్ జనతా పార్టీ అంతటి ప్రజాదరణ పొందింది. అదే తరహాలో ఇప్పుడు పుట్టుకొచ్చిన ఈ డిజిటల్ ప్రచారాలు, ‘రిజర్వేషన్ హఠావో ఆందోళన్’ వంటి ఉద్యమాలు వ్యవస్థలో అసలు మార్పులు తీసుకురాగలవా, లేక సోషల్ మీడియా పరిమితుల్లోనే మిగిలిపోతాయా అన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.