రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: న్యూఢిల్లీ : ఆధార్‌ను కేవలం వ్యక్తిగత గుర్తింపునకు సంబంధించిన ధ్రువపత్రంగానే పరిగణించాలి తప్ప పౌరసత్వం, నివాసం, చిరునామా, జన్మదినం వంటి అంశాలకు రుజువుగా ఉపయోగించరాదని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. ఈ అంశంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్‌కు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.
సీనియర్ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏవీ మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు పంపింది. ఆధార్‌ను పౌరసత్వం, నివాస స్థలానికి రుజువుగా పరిగణించకూడదనే విషయం ఆధార్ చట్టం సెక్షన్ 9లో స్పష్టంగా ఉన్నదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఆధార్ గుర్తింపునకు మాత్రమే రుజువు, పౌరసత్వానికి కాదని Unique Identification Authority of India (UIDAI) 2023 ఆగస్టు 22న నోటిఫికేషన్ జారీ చేసిన విషయాన్ని కూడా ఆయన పిటిషన్‌లో ప్రస్తావించారు. అయినప్పటికీ కొత్త ఓటర్ నమోదు ప్రక్రియలో, జన్మదినం, నివాసస్థలానికి రుజువుగా ఆధార్‌ను చూపిస్తున్నారని ఆయన కోర్టుకు వివరించారు.
ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఓటర్ నమోదు వంటి ప్రక్రియల్లో జన్మతేదీ, చిరునామా, నివాస స్థలానికి ఆధార్‌ను రుజువుగా స్వీకరించకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని అశ్వినీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టును కోరారు. ఆధార్ చట్టంలోని నిబంధనలు, UIDAI నోటిఫికేషన్ స్పష్టమైనప్పటికీ, అమలులో విరుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
దేశంలోకి అక్రమంగా వలస వచ్చిన కొందరు వ్యక్తులు అద్దె ఒప్పందాలు, స్థానిక అధికారుల సిఫారసుల ఆధారంగా ఆధార్ కార్డులు పొందుతున్నారని, ఆ ఆధార్ ఆధారంగా పౌరసత్వం కలిగిన వారిగా తమను చూపించుకుని Voter ID కార్డులు కూడా సంపాదిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ విధమైన దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
పిటిషన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ తమ తమ వాదనలు, అభిప్రాయాలు సమర్పించాల్సి ఉండగా, తదుపరి విచారణ తేదీని సుప్రీంకోర్టు తరువాత నిర్ణయించే అవకాశం ఉంది. ఆధార్ వినియోగ పరిమితులపై ఈ కేసు ద్వారా మరింత స్పష్టత వచ్చే అవకాశముందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.







