కారుణ్య నియామకాల్లో వివాహిత కుమార్తెలకూ హక్కు: సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఢిల్లీ : కుటుంబ నిర్వచనం పరిధి నుంచి వివాహిత కుమార్తెను మినహాయించడం ఏకపక్షం, అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కారుణ్య నియామకాలు, చౌక ధరల దుకాణాల లైసెన్సుల కేటాయింపుల వంటి అంశాల్లో వివాహిత కుమార్తెలను కూడా అర్హులుగానే పరిగణించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.

జస్టిస్‌ పి.ఎస్‌. నరసింహ, జస్టిస్‌ ఆలోక్‌ ఆరాధే లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. రేషన్‌ షాపు డీలర్‌గా పనిచేసిన తండ్రి మరణానంతరం అతని స్థానంలో చౌక ధరల దుకాణం లైసెన్స్‌ను తనకు కేటాయించాలంటూ కుమార్తె చేసిన అభ్యర్థనను ధర్మాసనం సమర్థించింది. ఆమె విజ్ఞప్తిని తిరస్కరించిన అలహాబాద్‌ హైకోర్టు తీర్పును కొట్టివేసింది.

కారుణ్య నియామకాల సందర్భంలో వివాహమై అత్తగారింటికి వెళ్లిన కుమార్తెను పుట్టింటి కుటుంబ సభ్యురాలిగా పరిగణించరాదని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును రేషన్‌ షాపు డీలర్‌ కుమార్తె హైకోర్టులో సవాల్‌ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అలహాబాద్‌ హైకోర్టు సమర్థించగా, సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని తిరస్కరించింది.

తండ్రి మరణానంతరం ఆ కుటుంబానికి అండగా నిలుస్తూ, కుటుంబ భారాన్ని పిటిషనర్‌ మోస్తున్నారని సుప్రీంకోర్టు గమనించింది. వివాహమైనప్పటికీ పుట్టింట్లోనే ఉంటూ దివ్యాంగురాలైన సోదరి సంరక్షణతో పాటు కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తున్న విషయాన్ని ధర్మాసనం ప్రత్యేకంగా ప్రస్తావించింది.

తల్లి మరణానంతరం ఆ రేషన్‌ షాప్‌ లైసెన్స్‌కు పిటిషనర్‌ దరఖాస్తు చేసుకున్న అంశాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. తండ్రి, తల్లి మృతితో కుటుంబ సభ్యులు పిటిషనర్‌పై ఆధారపడుతున్నారని, చౌక ధరల దుకాణం ఉన్న గ్రామంలోనే ఆమె నివసిస్తున్నారని ధర్మాసనం పేర్కొంది. ఈ వాస్తవాలను సంబంధిత అధికారులు కూడా అంగీకరించినట్లు తీర్పులో నమోదు చేసింది.

వివాహమైనంత మాత్రాన కుమార్తెతో కుటుంబ బంధం ముగిసిపోదని, ఆ బంధం కొనసాగుతూనే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. వివాహమైన కుమారుడు విడిగా దూరంగా ఉంటున్నప్పటికీ అతన్ని కుటుంబ సభ్యుడిగా పరిగణిస్తూ, కుమార్తె విషయంలో భిన్నంగా ఆలోచించడం లింగ వివక్షకు దారితీస్తుందని కోర్టు అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలో పిటిషనర్‌కు చౌక ధరల దుకాణం లైసెన్స్‌ జారీ చేయాలని సంబంధిత అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. వివాహిత కుమార్తెల హక్కుల పరిరక్షణ, లింగ సమానత్వం దిశగా ఈ తీర్పు మైలురాయిగా భావిస్తున్నారు.