రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసులు చేపట్టిన చర్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని బుధవారం ఓ న్యాయవాది ప్రస్తావించారు.
కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల సందర్భంగా విద్యార్థులపై పోలీసుల అతిక్రమణలపై కోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలని న్యాయవాది కోరారు. దీనిపై స్పందించిన ధర్మాసనం, ఈ దశలో అత్యవసర విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది.
మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు, అంత సమయం కూడా లేదు
అని సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానిస్తూ, సిజెపి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలపై జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను తోసిపుచ్చారు. కోర్టు సమయాన్ని సద్వినియోగం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తూ, న్యాయవాదులూ తమ సమయాన్ని వృథా చేసుకోకూడదని ఆయన హితవు పలికారు.
మా సమయాన్ని వృథా చేయకండి, మీ సమయాన్ని కూడా పాడుచేసుకోకండి
అని సీజేఐ న్యాయవాదికి స్పష్టంగా చెప్పారు. నీట్-యుజి (NEET-UG) 2026 పేపర్ లీక్, పరీక్షల నిర్వహణలో లోపాలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో సంస్కరణలు వంటి ప్రజా ప్రాముఖ్యత ఉన్న అంశాలపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని న్యాయవాది వాదించారు.
థ్యాంక్యూ వెరీ మచ్
అంటూ సీజేఐ ఆయన వాదనను అక్కడితో ముగించారు. అనంతరం, పోలీసుల అతిక్రమణలకు సంబంధించి లభ్యమైన వీడియోలను పరిశీలించాలని న్యాయవాది మళ్లీ కోరగా, ధర్మాసనం మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది.
మాకు సమయం లేదు, ఆ వీడియోలు మేం చూడాలనుకోవడం లేదు
అని సీజేఐ తేల్చి చెప్పారు. ఇదే అంశంపై అత్యవసర విచారణ జరపాలన్న పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కూడా మంగళవారం తిరస్కరించిన విషయం తెలిసిందే.
కోర్టును ఈ వ్యవహారంలోకి లాగవద్దు
అని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నీట్-యుజి పేపర్ లీక్, ఇతర పరీక్షల అక్రమాలపై కాక్రోచ్ జనతా పార్టీ ప్రధానంగా నిరసనలు నిర్వహిస్తోంది.
నిరుద్యోగ యువత జర్నలిజం, సామాజిక ఉద్యమాల వైపు రావడంపై గతంలో సీజేఐ సూర్య కాంత్ స్పందిస్తూ ‘కాక్రోచ్’ (బొద్దింకలు) అనే పదాన్ని ఉపయోగించారు. ఆ వ్యాఖ్యల ఆధారంగానే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే వ్యంగ్య వేదిక ఏర్పడింది. ఆ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో, తాను నకిలీ డిగ్రీలు ఉన్న వారిని ఉద్దేశించి మాత్రమే ఆ పదాన్ని వాడానని సీజేఐ తరువాత వివరణ ఇచ్చారు.







