ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో ఎల్పీజీ గ్యాస్‌ ట్యాంకర్‌ అదుపు తప్పి టోల్‌ ప్లాజాను ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. కోక్‌రాజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షిహోరి టోల్‌ ప్లాజా వద్ద మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. ట్యాంకర్‌ డ్రైవర్‌ ధర్మేంద్ర ద్వివేది కూడా మృతుల్లో ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

కాన్పూర్‌ నుంచి వారణాసి దిశగా వెళ్తున్న రెండు ఎల్పీజీ గ్యాస్‌ ట్యాంకర్లు షిహోరి టోల్‌ ప్లాజా వద్దకు చేరుకున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న ట్యాంకర్‌ టోల్‌ ప్లాజాను దాటి కొద్దిసేపట్లోనే మరో ట్యాంకర్‌ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొంది. ఢీకొన్న వెంటనే ట్యాంకర్‌ నుంచి భారీగా ఎల్పీజీ గ్యాస్‌ లీకై చుట్టుపక్కల ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది.

గ్యాస్‌ లీకేజీతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా పొగమంచు ముసురుకున్నట్టుగా మారింది. కొద్ది సేపట్లోనే గ్యాస్‌కు మంటలు అంటుకోవడంతో టోల్‌ ప్లాజా మొత్తం మంటల్లో చిక్కుకుంది. టోల్‌ బూతులు, సమీప నిర్మాణాలు పూర్తిగా కాలిపోయాయి. మంటలు అంత వేగంగా వ్యాపించడంతో అక్కడ ఉన్న కొందరు బయటపడే అవకాశం లేక సజీవ దహనమయ్యారు.

ప్రమాద సమయంలో టోల్‌ ప్లాజా వద్ద పనిచేస్తున్న సిబ్బంది, అక్కడుగా వెళ్తున్న వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు, గ్యాస్‌ లీకేజీ సమయంలో ఏర్పడిన దట్టమైన పొగకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీడియోల్లో టోల్‌ ప్లాజా పూర్తిగా మంటల్లో కూరుకుపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే ట్యాంకర్‌ డ్రైవర్‌ ధర్మేంద్ర ద్వివేది సహా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. మృతదేహాలను బయటకు తీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు.

మరో ఎల్పీజీ ట్యాంకర్‌ ప్రమాదానికి కొద్దిసేపటి ముందే టోల్‌ ప్లాజాను దాటి వెళ్లడం పెద్ద ప్రమాదాన్ని తప్పించిందని అధికారులు పేర్కొన్నారు. రెండో ట్యాంకర్‌ కూడా అక్కడే ఉండి ఉంటే పేలుడు తీవ్రత, ప్రాణనష్టం మరింత పెరిగేదని భావిస్తున్నారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ట్యాంకర్‌ వేగం, డ్రైవర్‌ అలసట, యాంత్రిక లోపం వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. టోల్‌ ప్లాజా పరిసరాల్లో కొంతసేపు రహదారి రాకపోకలను నిలిపివేసి, అనంతరం పరిస్థితి సాధారణం కావడంతో ట్రాఫిక్‌ను మళ్లీ పునరుద్ధరించారు.