రానున్న ఆరు వారాల్లో దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాల్లో హబ్‌ అండ్‌ స్పోక్‌ సేవలు ప్రారంభం కానున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌ నాయుడు ప్రకటించారు. నేడు వారణాసిలో హబ్‌ అండ్‌ స్పోక్‌ సేవలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కేంద్రమంత్రి మాట్లాడుతూ.. తొలుత వారణాసి నుంచి ఎయిరిండియా ఈ సేవలను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ మోడల్‌తో భారత్‌ గ్లోబల్‌ ఏవియేషన్‌ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిన్న నగరాల నుంచి అంతర్జాతీయ గమ్యస్థానాలకు వెళ్లే ప్రయాణికులు దిల్లీ వంటి పెద్ద ఎయిర్‌పోర్టుల మీదుగా ప్రయాణించే అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రయాణికులకు ఆయన స్వయంగా బోర్డింగ్‌పాస్‌లు ఇచ్చారు. ఈజీ కనెక్ట్‌ సర్వీసు కింద తొలి ఏఐ1111 విమానం వారణాసి నుంచి ఉదయం 9.30 గంటలకు దిల్లీకి బయల్దేరింది.

ప్రపంచ దేశాలకు భారత్‌లోని ప్రాంతాలు మరింత చేరువ: ప్రధాని మోదీ

హబ్‌ అండ్‌ స్పోక్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఓ సందేశం పంపారు. చిన్న నగరాల ప్రజలకు ప్రపంచ వ్యాప్త గమ్యస్థానాలు మరింత దగ్గరవుతాయని అభిప్రాయపడ్డారు. అది ప్రాంతీయ అభివృద్ధితోపాటు భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సాయం చేస్తుందన్నారు. 

హైదరాబాద్‌లో కూడా ఈ సేవలు..

ఎయిరిండియా సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ మాట్లాడుతూ.. ఈజీ కనెక్ట్‌ఫ్లైట్‌ సేవలను త్వరలోనే హైదరాబాద్‌, చెన్నై, అమృత్‌సర్‌, కొచ్చి, గోవాకు విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఈ సేవలతో ప్రయాణికులు తమ తొలి ఎయిర్‌పోర్టులోనే బ్యాగేజీ, ఇమిగ్రేషన్‌ ప్రాసెస్‌ పూర్తి చేసుకోవచ్చన్నారు.