రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ఈ వారాంతం ఓటీటీ వేదికలపై ప్రేక్షకులకు వినోదం రెట్టింపుకానుంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన పలు చిత్రాలు, విజయవంతమైన వెబ్‌సిరీస్‌ల కొత్త సీజన్లు ఇప్పుడు ఇంటి వద్దే అందుబాటులోకి వచ్చాయి. తెలుగు ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఓటీటీ సంస్థలు తమ తాజా కంటెంట్‌ను స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చాయి.
అనుపమ పరమేశ్వరన్, రెజీనా, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో నటించిన థ్రిల్లర్ చిత్రం ‘మరీచిక’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. సతీశ్ కాశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్‌లో థ్రిల్ పంచిన తర్వాత, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. వెంకటలక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి, సంజు అనే నగర యువకుడి మధ్య బలపడుతున్న బంధంలోకి మరీచిక అనే ఎన్నారై ప్రవేశించడంతో వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాల చుట్టూ కథ తిరుగుతుంది.
వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరించే రవిబాబు తాజా చిత్రం ‘రేజర్’ కూడా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవిబాబు స్వీయ దర్శకత్వంలో, ప్రధాన పాత్రలో నటించిన ఈ డార్క్ యాక్షన్ థ్రిల్లర్ మే 8న థియేటర్లలో విడుదలై యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ మలయాళంతో పాటు తెలుగులోనూ విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి వచ్చింది. థ్రిల్లర్ జానర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ఈ చిత్రం ఓటీటీలో కూడా మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది.
అభినవ్ గోమఠం, ప్రియదర్శి, చైతన్యకృష్ణ నటించిన సూపర్‌హిట్ వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ ఇప్పటికే రెండు సీజన్లతో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మూడో సీజన్ ‘సేవ్ ది టైగర్స్ 3’ Jio Hotstar వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కుటుంబ నేపథ్యంలో సాగుతూ హాస్యంతో నిండిన ఈ సిరీస్ తాజా సీజన్‌లో దేవుడితో ముడిపడిన సన్నివేశాలను కూడా చూపిస్తూ వినోదాన్ని పంచుతోంది.
ముగ్గురు స్నేహితులు సైకిల్ మీద రోడ్ ట్రిప్‌కి వెళ్లాలని నిర్ణయించుకోవడంతో వారి జీవితాల్లో జరిగే మార్పుల చుట్టూ తిరిగే కథ ‘జయముంది భయమేల మనసా’. భరణ్ దండమూడి, రవి మహాదాస్యం, రాజేశ్ ఖన్నా, శరణ్యశర్మ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రంజిత్ పాశం దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రస్తుతం ETV Win వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇవే కాకుండా ఈ వారం పలు ఇతర భాషల చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు కూడా ఓటీటీల్లోకి వచ్చాయి. Netflixలో ‘ధురంధర్: ది రివెంజ్’ (హిందీ/తెలుగు), ‘My America’s Sweethearts’ సీజన్ 3 (ఇంగ్లీష్), ‘Drinking Buddies’ (ఇంగ్లీష్), ‘I Will Find You’ (ఇంగ్లీష్/తెలుగు), ‘Voice Mails For Isabella’ (ఇంగ్లీష్/తెలుగు), ‘Oasis’ సీజన్ 1 (ఇంగ్లీష్/తెలుగు) స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Amazon Primeలో ‘మనితన్ దైవమంగళం’ (తమిళ్), ‘Ginni Weds Sunny 2’ (హిందీ), ‘Your Fault: London’ (ఇంగ్లీష్/తెలుగు) అందుబాటులోకి వచ్చాయి. Jio Hotstarలో ‘Kenatha Kanom’ (తమిళ్), ‘Tukra Ke Mera Pyaar’ సీజన్ 2 (హిందీ, తెలుగు) స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఆహా వేదికగా ‘Shh.. Shh.. Shh...’ సీజన్ 3 (తెలుగు/తమిళ్), ‘ధైర్య సాహసే అమృత’ (తెలుగు) ప్రేక్షకులను అలరిస్తుండగా, ETV Winలో ‘జయముంది భయమేల మనసా’ (తెలుగు) అందుబాటులో ఉంది. SonyLIVలో ‘అతిరథి’ (మలయాళం/తెలుగు), SunNXTలో ‘ఆషాన్’ (మలయాళం) స్ట్రీమింగ్ అవుతున్నాయి.
మొత్తం గా ఈ వీకెండ్ ఓటీటీ వేదికలపై థ్రిల్లర్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇలా అన్ని రకాల జానర్లలో కొత్త కంటెంట్ అందుబాటులో ఉండటంతో సినీప్రియులకు వినోదం పుష్కలంగా లభించనుంది.







