అమరావతి : పదవి ఎవరికీ శాశ్వతం కాదని, పనిచేసినంతకాలం మాత్రమే పదవి సురక్షితమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సర్ (SIR) వర్క్ షాప్‌లో ఆయన నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సంధర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఈ నెల 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామక ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకుని ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆయన హైలైట్ చేశారు.

మిత్రపక్షాల బలం ఎక్కువా తక్కువా అనే లెక్కలు పెట్టుకోవడం అవసరం లేదని, అలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకూడదని సీఎం సూచించారు. పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వడం ఎమ్మెల్యేల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ జెండా మోయాలంటే, ఆ జెండా ద్వారా వచ్చిన అధికారంలో కార్యకర్తలను భాగస్వాములుగా చేయాల్సిందేనని తెలిపారు.

పదవి శాశ్వతం కాదని మరోసారి గుర్తుచేసిన చంద్రబాబు నాయుడు పనిచేసినంతకాలం పదవికి ఎలాంటి ప్రమాదం ఉండదని అన్నారు. పని చేయని వారిని మాత్రం ఎటువంటి మొహమాటం లేకుండా పక్కనపెట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఎవరూ వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోకూడదని ఆయన సూచించారు.

అమెరికన్ డెమోక్రసీ లో ఒక వ్యక్తి రెండు సార్లు మాత్రమే ఎన్నికయ్యే అవకాశం ఉంటుందని ఉదాహరణగా ప్రస్తావించిన సీఎం, మన వ్యవస్థలో ప్రజలు మెచ్చినంతకాలం ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. అయితే, దానికి ఎమ్మెల్యేల ప్రవర్తనే కీలకమని ఆయన స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యల ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజలతో అనుసంధానం, కార్యకర్తల గౌరవం, మిత్రపక్షాల సమన్వయం, వ్యక్తిగత ప్రవర్తన – ఇవన్నీ ఎమ్మెల్యేల భవిష్యత్తును నిర్ణయించే అంశాలని స్పష్టం చేశారు. పనిచేయని, నియంత్రణలేని వ్యాఖ్యలు చేసే ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి సందేహం ఉండబోదని ఆయన సంకేతాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.