ఆంధ్రప్రదేశ్ - ఆస్ట్రేలియాల మధ్య నాలుగు ఎంవోయూలు కుదిరాయి. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఎంవోయూలను కుదుర్చుకున్నారు. క్లీన్‌ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ రంగాల్లో ఈ ఒప్పందాలు చేసుకున్నారు. విద్యా, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఏపీ - ఆస్ట్రేలియా మధ్య ఈ ఒప్పందాలు జరిగినట్లు లోకేశ్ తెలిపారు. IIT తిరుపతిలో సోలార్ తయారీ రంగంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా లోకేశ్ పోస్టు పెట్టారు.

ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్యా, అంతర్జాతీయ అభివృద్ధి, బహుళ సాంస్కృతిక వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్‌కి స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. గత సంవత్సరం తన ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా జరిగిన ఫలవంతమైన చర్చల ఫలితంగా, స్వచ్ఛ ఇంధనం, అధునాతన తయారీ, సమ్మిళిత విద్య, విద్యార్థుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో నాలుగు వ్యూహాత్మక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశామని వెల్లడించారు. ఈ ఎంవోయూల ద్వారా తమ ఉద్దేశాన్ని ఆచరణలోకి తీసుకువచ్చామని చెప్పుకొచ్చారు. ఈ అవగాహన ఒప్పంద ఆవిష్కరణ, ప్రతిభ, ఉమ్మడి శ్రేయస్సుపై నిర్మించిన బలమైన ఆంధ్రప్రదేశ్ - ఆస్ట్రేలియా భాగస్వామ్యానికి నాంది పలుకుతుందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.