కేంద్ర సహకారంతో స్వర్ణాంధ్రే లక్ష్యం

ఏపీలో చీకటి పాలన పోయి ప్రజాపాలన వచ్చింది : సీఎం చంద్రబాబు

తిరుపతి : 2024 ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రాన్ని గెలిపిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామని అప్పట్లో ప్రజలను కోరామని, ఆ పిలుపుకు ప్రజలు సమాధానం ఇచ్చి రాష్ట్రాన్ని తామే కాపాడుకున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర సహకారంతో సంక్షేమ పాలన సాగుతోందన్నారు.

కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరుతో తిరుపతిలోని దామినేడులో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తూ.. 2024 ఎన్నికల్లో కూటమి 57 శాతం ఓటు శాతం, 94 శాతం స్ట్రయిక్‌ రేట్‌ సాధించిందని వివరించారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే మొదలైందని గుర్తుచేశారు.

రాష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని, జగన్‌ చేసిందేమీ లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రజా వేదిక కూల్చివేతతో జగన్‌ అరాచక పాలన మొదలైందని, కేంద్ర పథకాలు, సాగునీటి ప్రాజెక్టులను పక్కన పెట్టారని ఆరోపించారు. అప్పులు, అరాచకాలు, ఆర్థిక విధ్వంసం తప్ప జగన్‌ పాలనలో మరేమీ జరగలేదని, అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.

అలాంటి దశలో తాను నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించానని చంద్రబాబు తెలిపారు. ఏపీలో చీకటి పాలన పోయి ప్రజాపాలన వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్‌ ఇచ్చి కేంద్రం బతికించిందని, అమరావతి, పోలవరం, రైల్వే జోన్‌ అంశాల్లో కేంద్ర సహకారం లభించిందని వివరించారు. అన్ని వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టే పనిలో ఉన్నామని చెప్పారు.

అన్ని వర్గాలను ఆదుకుంటూ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నామని సీఎం తెలిపారు. ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యాలతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. 63 లక్షల మందికి NTR భరోసా పెన్షన్లు అందజేశామని, ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ ‘తల్లికి వందనం’ పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నామని చెప్పారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద రైతులకు ఏడాదికి రూ.20 వేలు అందజేస్తున్నామని, రైతులు, గీత కార్మికులు, వడ్డెర్లు, చేనేతలు సహా అన్ని వర్గాలను ఆదుకున్నామని వివరించారు. P4 ప్రయోగంతో ఆర్థిక అసమానతలను తగ్గించామని తెలిపారు.

21వ శతాబ్దం ప్రధాని మోదీదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌తో దేశానికి మోదీ ఆత్మస్థైర్యం ఇచ్చారని, మోదీ పాలనలో భారత్‌ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని అన్నారు. 2047 నాటికి భారత్‌ ప్రపంచంలో తిరుగులేని శక్తిగా మారుతుందనే ధీమా వ్యక్తం చేశారు. పుట్టపర్తిలో ఐదో తరం ఫైటర్‌ జెట్‌ తయారుకాబోతోందని, తిరుపతిలో బుల్లెట్‌ ఫ్యాక్టరీ వస్తోందని, రాయలసీమ ఇప్పుడు బంగారుసీమగా మారబోతోందని తెలిపారు.

వచ్చే నెలలో రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రారంభించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. జొన్నవాడలో బంగారం వెలికితీసే పనులు చేపడతామని, గ్రీన్‌ ఎనర్జీ, సోలార్‌, విండ్‌ పవర్‌పై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని, రూ.లక్ష కోట్లతో రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. కల్యాణి డ్యామ్‌కు ఈ ఏడాది నీళ్లు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

మూడు రాజధానుల పేరుతో గత ప్రభుత్వం మూడుముక్కలాట ఆడిందని చంద్రబాబు మండిపడ్డారు. మూడు రాజధానులు కాదని, మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.