రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్:
మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు
షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, వైరల్ అయిన ఆడియోలో షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌తో పాటు కొందరు మహిళా నాయకులపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆడియో బయటకు రావడంతో కాంగ్రెస్ హైకమాండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనే అంశంపై షబ్బీర్ అలీ నుంచి వివరణ కోరుతూ ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు పంపినట్లు సమాచారం. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగ చర్చకు తీసుకురావడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నోటీసుకు నిర్ణీత గడువులోపు సమాధానం ఇవ్వాలని షబ్బీర్ అలీకి సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌లో వర్గపోరు మరింత ముదురుతోంది. షబ్బీర్ అలీ వర్గం, చంద్రశేఖర్ రెడ్డి వర్గం మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని స్థానిక నేతలు చెబుతున్నారు. పరస్పర ఆరోపణలు, దుష్ప్రచారాలతో జిల్లా కాంగ్రెస్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఈ క్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సొంత పార్టీ నేతలే తనపై తప్పుడు ప్రచారం, దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించినట్లు సమాచారం. తమపై జరుగుతున్న ఈ దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఇందుప్రియ పోలీసులను కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. షబ్బీర్ అలీపై ఏఐసీసీ క్రమశిక్షణ చర్యలు, కామారెడ్డిలో వర్గపోరు, పరస్పర ఆరోపణలు కలిసివచ్చి జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. రాబోయే రోజుల్లో పార్టీ హైకమాండ్ జోక్యం, స్థానిక నాయకత్వం స్పందనపై అక్కడి రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.







