యువత రాజకీయాల్లోకి రావాలి
షైనింగ్‌ స్టార్స్‌ సత్కార కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌

పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యధిక మార్కులతో విద్యార్థులు గెలిచి, తనను గెలిపించారని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ఇటీవల పది, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను తాడేపల్లిలో షైనింగ్‌ స్టార్స్‌ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సన్మానించారు. 55 మంది పదో తరగతి వారికి రూ.30వేలు, పతకం, ధ్రువీకరణపత్రం, 61 మంది ఇంటర్మీడియట్‌ వారికి ల్యాప్‌టాప్, పతకం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మీకు తక్కువ మార్కులు వస్తే ముఖ్యమంత్రి నా మంత్రి పదవి పీకేసేవారు. అత్యధిక మార్కులు తెచ్చుకుని మీరు గెలిచారు. నన్ను గెలిపించారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొచ్చారు. నాకు ఎక్కువ మార్కులు పడేలా చేశారు. మీ పనితీరుతో మంత్రిగా నా గౌరవంతో పాటు 2లక్షల మంది టీచర్ల గౌరవం పెరిగింది. విద్యాశాఖ వ్యవసాయం లాంటిది. ఫలితాలు వెంటనే రావు. పంట చేతికొచ్చినప్పుడు రైతులకు కలిగిన ఆనందం ఈ రోజు నాకు కలుగుతోంది’’ అని తెలిపారు.

షైనింగ్‌ స్టార్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్లు

‘‘వైద్యుడు, ఇంజినీర్, ఐఏఎస్‌ అవుతానని డ్రీమ్, గ్రాటిట్యూడ్‌ వాల్స్‌పై విద్యార్థులు రాశారు. ఏ ఒక్కరూ రాజకీయ నాయకుడిని అవుతా.. సమాజాన్ని మారుస్తానని రాయలేదు. యువత రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో మార్పు సాధించాలని కోరుకుంటున్నా. ప్రభుత్వ పాఠశాలలకు షైనింగ్‌ స్టార్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్లు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సు కోరే రోజు వస్తుందని అసెంబ్లీలో చెప్పాను. మంగళగిరి నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి వెళితే నిడమర్రు పాఠశాలలో సీటు కావాలని ఓ తల్లి గొడవపడింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఇలాగే తయారు కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం’’ అని లోకేశ్‌ వెల్లడించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యతను మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. ‘‘ఫెయిల్‌ అంటే మొదటిసారి నేర్చుకోవడం. తప్పును ఎంత త్వరగా సరిదిద్దుకుంటామన్నదే ముఖ్యం. విద్యార్థులు ఒక సబ్జెక్టు ఫెయిలైతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీనివల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించాలి. సమయం దొరికితే మా అబ్బాయి దేవాన్ష్‌తో క్రికెట్‌ ఆడతాను’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌ విద్య డైరెక్టర్లు తమీమ్‌ అన్సారియా, రంజిత్‌బాషా పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ అమలు చేయాలని, పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షలకు శిక్షణ అందించాలని విద్యార్థులు కోరారు. షైనింగ్‌ స్టార్స్‌ కార్యక్రమంలో విద్యార్థులతో మంత్రి లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. కాకినాడకు చెందిన క్రాంతి పాఠశాల స్థాయి నుంచే కంప్యూటర్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్, మోటివేషన్‌ తరగతులు, గ్రంథాలయాలు ఉండాలని కోరారు. కదిరికి చెందిన షేక్‌ చాందిని తన తండ్రి కోసం కార్డియాలజిస్ట్‌ అవుతానని, నీట్‌ కోచింగ్‌కు సహాయం అందించాలని కోరారు. అనంతపురం జిల్లాకు చెందిన మనీష మాట్లాడుతూ.. తాను సివిల్స్‌కు సన్నద్ధమయ్యేందుకు కోచింగ్‌ అందించాలని, ఇందుకు ఆర్థిక సహాయం చేయాలని విన్నవించారు. మధ్యాహ్న భోజనంలో కూరల నాణ్యత పెంచాలని కర్నూలుకు చెందిన అబ్దుల్‌ రెహ్మన్‌ అడిగారు. నెల్లూరు జిల్లాలో వెల్లిపూడి, శంకవరం మధ్య రోడ్డు చెడిపోయిందని, ఎన్నో ప్రమాదాలు జరిగాయని విద్యార్థి స్వాతి తెలిపారు. 3, 4 నెలల్లో కొత్త రోడ్డు వేస్తామని మంత్రి లోకేశ్‌ బదులిచ్చారు.