మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం.. నటుడు సలీమ్‌కుమార్‌ మృతి

మలయాళ సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తుతూ జాతీయ పురస్కార గ్రహీత, ప్రముఖ నటుడు సలీమ్‌కుమార్‌ (56) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన, కొచ్చిలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో మలయాళ చిత్ర పరిశ్రమలో శోకసంద్రం అలముకుంది.

సలీమ్‌కుమార్‌ కుటుంబంలో భార్య సునీత, ఇద్దరు సంతానం ఉన్నారు. వారిలో చందూ సలీమ్‌కుమార్‌ సినీ రంగంలోకి అడుగుపెట్టి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చందూ, ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’, ‘కొత్తలోక’ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. తండ్రి మరణవార్త తెలిసిన సినీ వర్గాలు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

సలీమ్‌కుమార్‌ మృతి పట్ల మలయాళ సినీ పరిశ్రమతో పాటు రాజకీయ రంగం నుంచి కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌ ఆయనను తనకు సోదరుడిలాంటి వ్యక్తిగా అభివర్ణించినట్టు సమాచారం. ప్రముఖ నటుడు మమ్ముట్టి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ, ఎప్పుడూ నవ్వుతూ, ఇతరులను నవ్వించే సలీమ్‌కుమార్‌ ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టించారని పేర్కొన్నారు.

సినిమాల్లోకి రాకముందు సలీమ్‌కుమార్‌ మిమిక్రీ కళాకారుడిగా తన ప్రయాణం ప్రారంభించారు. 1990లలో సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, దాదాపు 300కిపైగా చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా మలయాళ చిత్రాల్లో కామెడీ పాత్రలకు ఆయన కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. తన ప్రత్యేక శైలి, టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించారు.

మలయాళంతో పాటు తమిళం, బెంగాలీ, హిందీ భాషల చిత్రాల్లోనూ సలీమ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. 2010లో విడుదలైన ‘అదామింతే మాకన్‌ అబూ’ చిత్రంలో ఆయన నటనకు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడిగా ఆయన పేరు నిలిచిపోయింది.

నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా సలీమ్‌కుమార్‌ తన ప్రతిభను చాటుకున్నారు. ‘కంపార్ట్‌మెంట్‌’ వంటి మలయాళ చిత్రాలకు దర్శకత్వం వహించడం ఆయన సినీ ప్రయాణంలో మరో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. విభిన్న పాత్రలు, వినూత్న హాస్యంతో ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన సలీమ్‌కుమార్‌ మరణం మలయాళ సినీ పరిశ్రమకు తీరని లోటుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.