‘జన నాయగన్‌’ థియేట్రికల్‌ డీల్స్‌ రద్దు?

వ్యూహం మార్చిన విజయ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది ఆరంభం నుంచే సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన చిత్రం ‘జన నాయగన్‌’. తమిళనాడు ముఖ్యమంత్రి, అగ్ర కథానాయకుడు విజయ్‌ చివరి సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం సెన్సార్‌ సమస్యల కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్‌, నాన్‌ థియేట్రికల్‌ ఒప్పందాలపై విజయ్‌ తీసుకున్న నిర్ణయం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

మొదటిగా ‘జన నాయగన్‌’ను జనవరి 9న థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. అయితే సెన్సార్‌ సంబంధిత కొన్ని ఇబ్బందుల వల్ల చివరి నిమిషంలో రిలీజ్‌ వాయిదా పడింది. అప్పటి నుంచి ఐదు నెలలు గడిచినా, కొత్త విడుదల తేదీపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నాన్‌ థియేట్రికల్‌ ఒప్పందాలు రద్దయినట్లు సమాచారం. ఇదే క్రమంలో ఇప్పటివరకు కుదిరిన అన్ని థియేట్రికల్‌ అగ్రిమెంట్లను కూడా రద్దు చేసి, డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించిన అడ్వాన్స్‌ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని విజయ్‌ నిర్మాతలకు సూచించినట్లు కోలీవుడ్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తేదీ ఖరారైన తర్వాత ఈ చిత్రాన్ని సొంతంగా, స్వతంత్రంగా విడుదల చేసుకోవాలని విజయ్‌ సలహా ఇచ్చినట్లు పరిశ్రమలో చర్చ నడుస్తోంది.

హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో సామాజిక అంశాలతో రూపొందిన ఈ పొలిటికల్‌ డ్రామాను కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించింది. ఇందులో విజయ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. మమితా బైజూ, బాబీ దేవోల్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ చిత్రం తెలుగు హిట్‌ సినిమా ‘భగవంత్‌ కేసరి’ ఆధారంగా తెరకెక్కిందనే వార్తలు గతంలో వినిపించాయి. అయితే ఆ అంశంపై అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు. సెన్సార్‌ సమస్యలు, ఒప్పందాల రద్దు వంటి పరిణామాల మధ్య ‘జన నాయగన్‌’ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న దానిపై సినీ వర్గాలు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.