అంతర్జాతీయ స్థాయిలో రోజురోజుకూ పడిపోతున్న భారత హాకీ జట్టు ప్రమాణాలపై మాజీ గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆసియా స్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తే సరిపోదని... బలమైన జట్లతో నిరంతరం పోటీపడితేనే మరింత మెరుగయ్యే అవకాశం ఉందని అన్నాడు. ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో ఆకట్టుకోలేకపోయిన భారత జట్టు ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో శ్రీజేశ్‌ మాట్లాడుతూ... ‘నేను భారత హాకీకి వ్యతిరేకిని కాదు. ఆట మీద ప్రేమ ఉన్నవాడిని... అందుకే బాధగా ఉంది. 

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భారత జట్టు ఎనిమిదో స్థానంలో నిలవడం నిరాశ పరిచింది. నాకు హకీ పరిజ్ఞానం పెద్దగా లేదు. ఇది నా అభిప్రాయం మాత్రమే. గత రెండు సీజన్‌లను పరిశీలిస్తే... మన ఆటతీరు ఏమాత్రం బాగాలేదు. కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చాం... కొత్త వ్యూహాలతో బరిలోకి దిగుతున్నాం అనేలాంటి సమాధానాలు చెప్పకండి’ అని వెల్లడించాడు. భారత జట్టు రెండు ఒలింపిక్‌ పతకాలు సాధించడంలో కీలకపాత్ర పోషించిన ఈ దిగ్గజ గోల్‌కీపర్‌... కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం భారత జూనియర్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.  

విదేశీ కోచ్‌లకు నెలకు రూ. 25 లక్షలు! 
భారత జూనియర్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన శ్రీజేశ్‌... జూనియర్‌ వరల్డ్‌కప్‌లో టీమిండియాకు కాంస్య పతకం అందించాడు. అయితే అతడి సేవలను వినియోగించుకోవడానికి బదులు కాంట్రాక్టు ముగియగానే... శ్రీజేశ్‌ స్థానంలో ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెడెరిక్‌ సొయేజ్‌ను కోచ్‌గా నియమించారు. ‘మన జట్టు ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీతో పాటు ఆసియా కప్‌ సాధించింది. అయితే ఆ టోర్నమెంట్‌లలో మనం ఎవరితో ఆడుతున్నాం అనేది కూడా చూడాలి. ఒకప్పుడు ఆసియా కప్‌కు ఆదరణ ఉండేది. ఇప్పుడు అందులో అసలు మనకు పోటీనేలేదు. ప్రస్తుతం భారత జూనియర్‌ జట్టు కూడా పాకిస్తాన్‌ను ఓడించగలదు. అలాంటి జట్టుతో మనకు పోటీ ఏంటి. 

ఆసియాలో మన జట్టుకు ఎదురులేదు. కానీ అది అంతర్జాతీయ స్థాయిలో మన జట్టు ప్రదర్శన స్థాయిని నిరూపించలేదు. ప్రొ హాకీ లీగ్‌ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే మన జట్టు ఏ దిశగా వెళ్తోందో తెలుస్తుంది. పెద్ద జట్లపై నిలకడగా విజయాలు సాధించినప్పుడే మనం ఎదుగుతున్నట్లు లెక్క. కేవలం ఆసియా స్థాయి టోర్నమెంట్‌లలో గెలిచేందుకు విదేశీ కోచ్‌లకు నెలకు రూ. 25 లక్షలు ఖర్చు పెడుతున్నాం. వరల్డ్‌ కప్, ప్రొ లీగ్, ఒలింపిక్స్‌ వంటి టోర్నీ ల్లో ప్రదర్శనను బట్టి కదా చూడాలి. ఆసియా స్థాయిలో రాణించి... పెద్ద జట్లకు పోటీనివ్వలేకపోవడం భారత హాకీకి మంచిది కాదు’ అని శ్రీజేశ్‌ అన్నాడు.