దక్షిణాఫ్రికా స్టార్‌ ఈతగాడు చాడ్ లె క్లోస్ కామన్వెల్త్‌ గేమ్స్‌ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. పురుషుల 4×100 మీటర్ల ఫ్రీస్టైల్‌ రిలేలో కాంస్య పతకం గెలిచి.. ఈ గేమ్స్‌లో అత్యధిక మెడల్స్‌ సాధించిన పురుష అథ్లెట్‌గా నిలిచాడు. ఈ కాంస్యంతో అతడి ఖాతాలో మొత్తం 19 కామన్వెల్త్ పతకాలు చేరాయి. దీంతో 18 పతకాలతో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా షూటర్ ఫిల్‌ ఆడమ్స్, ఇంగ్లాండ్‌ షూటర్ మిక్ గాల్ట్‌ల రికార్డును అధిగమించాడు. ఇప్పటి వరకు లె క్లోస్ ఏడు స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఎనిమిది కాంస్యాలతో మొత్తం 19 పతకాలు సాధించాడు.

ఈ విజయంపై 34 ఏళ్ల లె క్లోస్ స్పందిస్తూ ‘‘కాంస్యం వచ్చిందని బాధపడను. స్వర్ణం రాలేదని నిరాశగా ఉంది. ఈ రికార్డు నాకు చాలా విలువైనది’’ అని చెప్పాడు. క్లోస్‌ పతకాల వేట ఇంకా ముగియలేదు. అతడు 50 మీటర్లు, 100 మీటర్ల బటర్‌ఫ్లై విభాగాల్లో కూడా పోటీపడనున్నాడు. దీంతో పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కూడా లె క్లోస్ అద్భుత విజయాలు సాధించాడు. ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ఒక స్వర్ణం సహా నాలుగు పతకాలు గెలిచాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో 16 టైటిళ్లు సొంతం చేసుకున్నాడు.