రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, బలమైన ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫలితంపై ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులంతా కన్నేసి ఉన్నారు.
ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఐదుసార్లు ఎదురెదురయ్యాయి. అందులో ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌లు గెలవగా, అర్జెంటీనా రెండు విజయాలు సాధించింది. మొత్తం అంతర్జాతీయ మ్యాచ్‌ల పరంగా చూస్తే ఇరుజట్లు 14 సార్లు పోటీపడ్డాయి. ఇంగ్లాండ్ ఆరు విజయాలతో ముందంజలో ఉండగా, అర్జెంటీనా మూడు మ్యాచ్‌లు గెలిచింది. మరో ఐదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
అర్జెంటీనా–ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రపంచకప్ వేదికపై పోరు జరగడం 24 ఏళ్ల తర్వాత జరుగుతున్న విశేషం. ఇంగ్లాండ్‌తో ప్రపంచకప్‌లో ఆడబోయే అవకాశం అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సికి ఇదే తొలిసారి. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ల్లో నాటకీయత, ఉత్కంఠకు ఎప్పుడూ కొదవ ఉండదు.
1986 ప్రపంచకప్‌లో డియాగో మారడోనా చేసిన వివాదాస్పద ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ ఇంగ్లాండ్‌పైనే నమోదైంది. 1998లో జరిగిన ప్రపంచకప్‌లో అర్జెంటీనా ఆటగాడు డియాగో సిమియోన్‌ను తన్నినందుకు ఇంగ్లాండ్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్‌కు రెడ్‌కార్డు చూపించారు. ఆ సంఘటనలు ఈ పోరుకు చారిత్రక నేపథ్యాన్ని మరింత ఘనత చేకూరుస్తున్నాయి.
ప్రస్తుత టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌లో ఇరుజట్లు కూడా తీవ్రంగా శ్రమించి గెలుపొందాయి. అయితే మొత్తం ప్రదర్శనలో ఇంగ్లాండ్ కొద్దిగా ఎక్కువ స్థిరత్వాన్ని చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కీలక సెమీఫైనల్ పోరులో కెప్టెన్ హ్యారీ కేన్, జూడ్ బెల్లింగ్‌హామ్‌లపై ఇంగ్లాండ్ భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ ఇద్దరూ ఇప్పటివరకు చెరో ఆరు గోల్స్ నమోదు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.
అర్జెంటీనా తరఫున మెస్సి, జూలియన్ అల్వారెజ్, లాతరో మార్టినెజ్, ఎంజో ఫెర్నాండెజ్‌లు ప్రధాన బలంగా నిలుస్తున్నారు. మెస్సి ఇప్పటివరకు ఎనిమిది గోల్స్ సాధించి గోల్డెన్ బూట్ పోటీలో ముందంజలో ఉన్నాడు.
ఈ సెమీఫైనల్‌లో అర్జెంటీనా తన రెగ్యులర్ జెర్సీకి బదులుగా ప్రత్యామ్నాయ బ్లూ జెర్సీతో బరిలోకి దిగనుంది. బ్లూ జెర్సీ ధరించేందుకు అనుమతి ఇవ్వాలన్న అర్జెంటీనా ప్రత్యేక విజ్ఞప్తిని ఫిఫా ఆమోదించింది. సాధారణంగా రెండు జట్ల జెర్సీలు ఒకేలా ఉన్నప్పుడే ఒక జట్టు జెర్సీ మార్చుకుంటుంది. కానీ ఇంగ్లాండ్‌తో పోరులో అర్జెంటీనాకు అలాంటి సమస్య లేకపోయినా, గత విజయాల జ్ఞాపకార్థం బ్లూ జెర్సీకి ప్రత్యేక అనుమతి కోరింది.
ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా సాధించిన రెండు విజయాల సమయంలో కూడా ఆ జట్టు ప్రత్యామ్నాయ బ్లూ జెర్సీనే ధరించింది. అదే అదృష్టం ఈసారి కూడా కలిసివస్తుందన్న నమ్మకంతో అర్జెంటీనా జట్టు ఉంది. ఇంగ్లాండ్ మాత్రం తన సంప్రదాయ తెలుపు జెర్సీతోనే ఆడనుంది.
అర్జెంటీనా–ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరు బుధవారం అర్ధరాత్రి 12.30 గంటలకు ప్రారంభంకానుంది. విజేత జట్టు ఫైనల్‌లో స్పెయిన్‌తో తలపడనుంది.







